posted on Oct 21, 2024 3:05PM
దివ్వెల మాధురి యూట్యూబర్ గా ఆమెకు ఉన్న గుర్తింపు అంతంత మాత్రమే. అయితే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో వ్యవహారంలో మాత్రం మహా పాపులర్. దివ్వెల మాధురి తన భర్తను, దువ్వాడ శ్రీనివాస్ తన భార్యా బిడ్డలను వదిలేసి మరీ సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం రచ్చకెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ భార్యా కుమార్తెలు రోడ్డెక్కి ధర్నాలు సైతం చేశారు.
అయితే దువ్వాడ, దివ్వెల ఇసుమంతైనా ఖాతరు చేయలేదు. ప్రజలేమనుకుంటారన్న సంకోచం లేకుండా బాహాటంగా తమ మధ్య సంబంధం, అనుబంధం ఉన్నదని చాటారు. ఇద్దరూ కూడా వివాహం చేసుకుంటామనీ, అందుకు సంబంధించిన ప్రొసీజర్ జరుగుతోందని చెప్పారు. ప్రొసీజర్ అంటే దువ్వాడ శ్రీను తన భార్యకు, దివ్వెల మాధురి తన భర్తకు విడాకులు ఇచ్చేయడం అన్న మాట. ఆ విడాకుల ప్రక్రియ పూర్తి అయిన తరువాత చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంటామని ఇద్దరూ సంయుక్తంగా, వేరువేరుగా కూడా ప్రకటనలు ఇచ్చేశారు. టీవీ ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు.
అక్కడితో ఆగకుండా వీరిద్దరూ తిరుమల వేదికగా ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటిది కూడా చేశారు. అదిగా ఆ విషయంలోనే దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు నోటీసులు జారీ చేశారు. తిరుమల వేదికగా జరిగిన ఫోటో షూట్, ఆ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని గురించి చేసిన వ్యాఖ్యలపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. దివ్వెల మాధురి తిరుమల కొండపై వ్యవహరించిన తీరు తిరుమల ఆలయ నియమాలకు భంగం వాటిల్లేలా ఉందని విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు మాధురిపై బీఎన్ఎస్ 292, 296, 300 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాలలో అనుచిత ప్రవర్తన, మతపరమైన సెంటిమెంట్లకు భంగం కలిగించడం వంటి నేరాలకు మాధురి పాల్పడినట్లు పేర్కొంటూ ఆమెకు నోటీసులు జారీ చేశారు.