ఏపీ యంగ్ మినిస్టర్ నారా లోకేశ్ అమెరికా పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడుల సాధన కోసం పర్యటిస్తున్న ఓ వైపు ఇన్వెస్టర్స్, మరోవైపు ప్రవాసాంధ్రులు, టీడీపీ వీరాభిమానులు, కార్యకర్తలను కలుసుకుంటున్నారు. ఆంధ్రలోనే అనుకుంటే అమెరికాలోనూ లోకేశ్‌కు అభిమానుల తాకిడి తప్పలేదు. శాన్‌ఫ్రాన్సిస్కోలో క్షణం తీరిక లేకుండా వరుస భేటీలతో బిజిబిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తనను కలవడానికి వచ్చిన అభిమానులు, నేతలను నిరాశపర్చకుండా, కుదరదని వెనక్కి పంపకుండా ముచ్చటించి, సెల్ఫీలు దిగుతున్నారు. మంత్రి బసచేసిన ఫోర్ సీజన్స్ హోటల్ దగ్గరికి ఒకేసారి 200 మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు విచ్చేశారు. ఏ ఒక్కరినీ వెనక్కి పంపకుండా ఎంతో ఆప్యాయంగా, అభిమానంతో పలకరించి సాధకబాధకాలను తెలుసుకున్నారు. అనంతరం ఎంతో ఓపికగా సెల్ఫీలు దిగారు లోకేశ్. ఈ పరిణామంతో ప్రవాసాంధ్రులు, వీరాభిమానులు ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. లోకేశ్ క్రేజ్ చూసిన విదేశీయులు ఒకింత కంగుతిన్నారట. వామ్మో.. ఎవరీ యంగ్ పర్సన్, ఎక్కడ్నుంచి వచ్చారు..? అని ఆరా తీసే పనిలో పడ్డారట.
పెట్టుబడులతో రండి..
రెండో రోజు పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు నిశితంగా వివరించి ఆహ్వానించారు. ముఖ్యంగా.. గూగుల్ సీటీఓ ప్రభాకర్ రాఘవన్, జనరల్ అటమిక్స్ సిఇఓ డాక్టర్ వివేక్ లాల్, నియోట్రైబ్ వెంచర్స్ ఫౌండర్ కిట్టూ కొల్లూరి, జనరల్ కేటలిస్ట్స్ ఎండి నీరజ్ అరోరా, ఐ స్పేస్ ప్రెసిడెంట్ రాజేష్ కొత్తపల్లి, సిఎఫ్ఓ ప్రసాద్ పాపుదేసి, గూగుల్ మాజీ అధికారి సారిన్ సువర్ణ, స్మియోటా కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ వన్ టు వన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన పారిశ్రామిక పాలసీలు, ప్రోత్సాహకాలను మంత్రి లోకేష్ వారికి వివరించారు.
మంత్రికి వివరణ
ఈ సందర్భంగా పలు కంపెనీలు అందిస్తున్న డేటా సేవలు, కార్యకలాపాలను ఆయా సంస్థల ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి నిశితంగా వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 260కి పైగా ఇంటర్నేషనల్ బిజినెస్ ఎక్స్‌ఛేంజీ డేటాసెంటర్ల నెట్ వర్క్ కలిగి ఉందని లోకేశ్‌కు తెలిపారు. అనంతరం ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను కంపెనీల ప్రతినిధులకు లోకేశ్ వివరించారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ పాలసీలోని పవర్ సబ్సిడీతో పాటు పలు రాయితీలు ఇస్తున్నట్లు మెరుగైన ప్రోత్సాహాలు కూడా ఉంటాయని చెప్పారు. ఏపీలో కంపెనీలు పెట్టడానికి ముందుకొస్తే అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రతినిధులకు లోకేశ్ తెలియజేశారు.