పవన్ – జగన్‌ను మించిన విజయ్ రేంజ్!
పవన్ కల్యాణ్, విజయ్ ఈ ఇద్దరూ సినిమాల్లో పెద్ద స్టార్‌లే. రాజకీయాల్లో ఒకట్రెండు సార్లు దెబ్బతిన్న జనసేన అధిపతి ఇప్పుడు పొలిటికల్ స్టార్ కూడా అయ్యారు. అనుకున్నది సాధించి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు. ఇక తమిళ్ స్టార్ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. రాజకీయాల్లో కూడా హీరో అనిపించుకోవడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక అసలు విషయానికొస్తే.. ఎన్నికల్లో పోటీ చేయనిదే, ఎన్నికల్లో గెలవకుండానే పవన్‌ను మించిపోయారు విజయ్. దీంతో ఇప్పుడిదే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది.
ఇద్దరూ ఇలా..
కొత్త పార్టీ ఆవిర్భావం, సమావేశాలు అంటే అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు ఎంతో ఆసక్తిగా అంతకుమించి ఉత్సాహంతో పరుగులు తీస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే వైసీపీ స్థాపన, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలు, పాదయాత్ర, సిద్ధం సభలు ఇవన్నీ ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక జనసేన ఆవిర్భావం నుంచి నిన్న, మొన్నటి జరిగిన సభ వరకూ పవన్ ఎక్కడికెళ్లినా, ఎక్కడ సభలు నిర్వహించినా ఇసుకేస్తే రాలనంతగా జనాలు వచ్చేవారు. అభిమానుల కోలాహలం, సీఎం.. సీఎం అంటూ ఈలలు కేకలలతోనే నడిచేవి. కానీ 2014, 2019 ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోగా గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఇక ఒక్కసారిగా పరిణామాలు మారిపోవడం ఇక వైసీపీని అధ:పాతాళానికి తొక్కేస్తామని ముందే చెప్పి మరీ అనుకున్నది సాధించిన ఒకే ఒక్కడు పవన్. ఇక లక్షల్లో జనాలు వచ్చినా పోలింగ్ రోజున ఏం జరిగిందో మనం ప్రత్యక్షంగా జూన్-04న చూశాం.
చూశారా రేంజ్!
ఇప్పుడిక విజయ్ విషయానికొస్తే.. తమిళగ వెట్రి కళగం స్థాపించిన తర్వాత తొలిసారి విల్లుపురం జిల్లా విక్రవండిలో పార్టీ తొలి మహానాడు నిర్వహించారు. ఈ బహిరంగ సభకు సుమారు 8 లక్షలకు పైగా జనాలు తరలివచ్చారు. అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఒక్కసారిగా రావడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్, జగన్ ఇద్దరి ప్రభావాన్ని విజయ్ మించిపోయారు. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పవన్‌కు లక్షల్లో జనాభా వచ్చేవారు. కానీ ఫస్ట్ టైమ్ ఆ అభిమానుల తాకిడి, కార్యకర్తలు కోలాహాలం, జనసంద్రం అంతా పవన్‌ను మించిపోయింది. 8లక్షలకు పైగా అది కూడా తొలిసారి సభకు రావడం అంటే ఆషామాషీ విషయమేమీ కాదు. ఇప్పుడు విజయ్ రేంజ్ గురించి తమిళనాడులోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతగానో చర్చించుకుంటున్నారు.
అటు పవన్.. ఇటు జగన్!
అచ్చు గుద్దినట్లుగా జగన్ సిద్ధం సభలు మాదిరిగానే ఏర్పాట్లు, అభివాదం, డ్రెస్సింగ్ స్టయిల్, ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటన అన్నీ విజయ్ దించేశారని వైసీపీ కార్యకర్తలు కొందరు నెట్టింట్లో చెప్పుకుంటూ గర్వంగా ఫీలవుతున్నారు. ఇక పవన్ అభిమానులు అయితే.. మా లీడర్ లాగే స్పీచ్, ఆ యాక్షన్, కౌంటర్లు, పంచ్‌లు, విమర్శలు, మాట్లాడే తీరు అన్నీ సేమ్ టూ సేమ్ ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అటు జగన్.. ఇటు పవన్ ఇద్దర్నీ మించిపోయార్ విజయ్. అదెలాగంటే ప్రసంగంలో కానీ, జనసమీకరణలో కానీ, వాకింగ్ స్టయిల్ ఇవన్నీ ఆ ఇద్దరి ప్రభావాన్ని మించి విజయ విహారం చేశారని అర్థం చేసుకోవచ్చు. మొత్తమ్మీద తెలుగులో పేరుగాంచిన పవన్, జగన్ ఇద్దరినీ అన్ని విషయాల్లో విజయ్ మించిపోయారన్న మాట. ఇదే కంటిన్యూ అయ్యి, ఎన్నికలకు వెళితే ఫలితాలు ఎలా ఉంటాయన్నది చూడాలి.