రుషికొండ ప్యాలెస్.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన అతిపెద్ద కట్టడం, అంతకుమించి కోట్లు గుమ్మరించి కట్టిన భవంతి. దేనికోసం, ఎవర్ని ఉద్దేశించి కట్టారో అనేదానిపై నాటి నుంచి నేటి వరకూ క్లారిటీ లేని పరిస్థితి. ఎందుకంటే ఇది నిర్మించిన అసలు సిసలు వ్యక్తి నోరు మెదపట్లేదు. అది అతిథుల కోసం అని కొందరు.. ఇంకొందరేమో సీఎంవో కోసమని ఇలా ఎవరికి తోచినట్లుగా వారు చెప్పారు వైసీపీ నేతలు. దీంతో అసలు విషయం మరుగున పడిపోయింది. వాస్తవానికి వైసీపీ రెండోసారి గెలిచి ఉంటే పరిపాలన అక్కడ్నుంచే సాగేది అన్నది అక్షరాలా సత్యమే. అందుకే హంగు, ఆర్భాటాలతో జగన్ నిర్మించి ఉండొచ్చు. ఓడిపోయే సరికి జూన్-04నే పసుపు, ఎరుపు జెండాలు ప్యాలెస్‌పై ఎగిరాయి. పలువురు కూటమి పార్టీకి చెందిన నేతలు సందర్శించడం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తాజాగా సీఎం నారా చంద్రబాబు పరిశీలించడంతో ఈ ప్యాలెస్‌ను ఏం చేయబోతున్నారు? ముఖ్యమంత్రి మనసులో ఏముంది? అనేది తెలియట్లేదు.
సీఎం సందర్శన
అనకాపల్లి పర్యటన ముగించుకొని తిరుగుపయనంలో రుషికొండ ప్యాలెస్‌ను సీఎం సందర్శించారు. సుమారు అరగంటకుపై ప్రతి రూమ్‌ను పరిశీలించిన చంద్రబాబు ఒకింత ఆశ్చర్యపోయారట. అసలు జగన్ దేని కోసం ఇదంతా కట్టారు? ఎలా వాడుకోవాలని చూశారు? జగన్ మనసులో ఏముంది? అన్నట్లుగా ఆలోచించారట. సుమారు 600 కోట్ల రూపాయిలతో నిర్మించిన ఈ ప్యాలెస్‌ను ఎలా వాడుకోవాలో కూడా అర్థం కావట్లేదట. పోనీ టూరిజం లేదా మరోదానికి వాడుదామా..? అంటే దానిపైనా క్లారిటీ రావట్లేదట. ఇప్పటికే అణువణువూ పరిశీలించిన మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దగ్గరుండి మరీ చంద్రబాబుకు వివరించారు. ప్యాలెస్ లోపల, బయట గార్డెన్ అన్నీ నిశితంగా సీఎం పరిశీలించారు. అయితే దీనిపై ఎటూ తేల్చుకోలేకపోతున్న ప్రభుత్వం, సందర్శన అనంతరం ఒకట్రెండు రోజుల్లో ప్యాలెస్‌ను ఎలా వాడుకోవాలి? అనేదానిపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
తడిసి మోపెడు!
ఈ భారీ భవనానికి రోజుకు సుమారు లక్ష రూపాయిలు పైనే నిర్వహణ ఖర్చు అవుతోంది. రోజూ ఇంత మొత్తంలో భరించాలంటే ప్రభుత్వానికి పెద్ద భారమే. ఎందుకంటే అసలు ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం ఇందుకు కారణం. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పరిశీలించి సెల్ఫీలు, సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నారు. సీఎంతో చర్చించిన తర్వాత లోతుగా చర్చించి దీనిపై ఓ నిర్ణయానికి వస్తామని చెప్పారు. అనుకున్నట్లే ఇప్పుడు స్వయంగా సీఎం సందర్శించారు. దీంతో ప్యాలెస్‌పై చంద్రబాబుకు ఓ క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. టూరిజం, లేదా అతిథుల కోసం వాడుతారా..? లేకుంటే ప్రభుత్వ పరిధిలోకి తీసుకుని ఇతర అవసరాలకు వాడుతారా? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తనకు అప్పగిస్తే నెలకు ఇంత అన్నట్లుగా ప్రభుత్వానికి చెల్లిస్తానని గంటా శ్రీనివాస్ సర్కార్‌కు ఓ ప్రపోజల్ పెట్టారట. మంత్రి నారా లోకేశ్ సైతం తాను ఇక్కడ్నుంచి పరిపాలన, తన శాఖ బాధ్యతలు నిర్వహించడానికి ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారట. మరోవైపు ప్యాలెస్ సందర్శన అనంతరం పవన్ కల్యాణ్ మనసులో కూడా ఇదే ఉందట. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా..? అనేదానిపై పెద్ద ఉత్కంఠ నెలకొంది. ఈ నిర్ణయం ఉమ్మడిగా ఉంటుందా లేదా ఏకపక్షంగా ఉంటుందా అనేది కూడా అంతకుమించి ఆసక్తిని రేపుతోంది.