రానా దగ్గుబాటి ఎక్కడుంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా హోస్ట్ అవతారం ఎత్తితే మామూలు వినోదాన్ని పంచడు. తాజాగా ఐఫా అవార్డుల వేడుకలో తేజ సజ్జాతో కలిసి నవ్వులు పూయించాడు.
ఈ ఏడాది ఐఫా అవార్డుల వేడుకకు రానా, తేజ హోస్టులుగా వ్యవహరించారు. ఈ ఈవెంట్ లో తేజతో కలిసి రానా మిగతా హీరోలపై సెటైర్లు వేస్తూ ఒక ఆట ఆడుకున్నాడు. అప్పట్లో నమస్కారం అంటూ బాలకృష్ణ ఒక అభిమానితో మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సంభాషణను స్టేజ్ మీద రీక్రియేట్ చేసి నవ్వులు పూయించాడు రానా.
ఇక తేజతో కలిసి మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలపై కూడా సెటైర్లు వేశాడు. తేజని మహేష్ తో పోలుస్తూ “ఇద్దరూ చైల్డ్ ఆర్టిస్ట్ లు.. అతనేమో సూపర్ స్టార్, నువ్వేమో సూపర్ హీరో.. ఇద్దరూ సంక్రాంతికే వచ్చేశారు” అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడిన తేజ “ఆ సంక్రాంతి మేటర్ వద్దు” అంటూ టాపిక్ ని డైవర్ట్ చేశాడు. సంక్రాంతికి హనుమాన్, గుంటూరుకారం సినిమాలు బాక్సాఫీస్ వార్ కి దిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హనుమాన్ కి థియేటర్లు దొరక్కుండా చేశారంటూ కొంత వివాదం నడిచింది. చివరికి సంక్రాంతి విన్నర్ గా హనుమాన్ నిలిచింది. అలాంటిది ఇప్పుడు సంక్రాంతి టాపిక్ ని తీసుకొచ్చి.. ఓ రకంగా మహేష్ ఫ్యాన్స్ ని కెలికారని చెప్పవచ్చు.
అలాగే తేజ చేత కొన్ని సినిమా న్యూస్ ని రానా చదివించాడు. అందులో ఆదిపురుష్ పై సెటైర్ వేశాడు. “ఆదిపురుష్ సినిమాకి ప్రతి థియేటర్ లో ఒక సీటు ఆంజనేయస్వామికి వదిలేశారు. ఆంజనేయస్వామి కూడా ఓటీటీలో చూద్దామని వదిలేశాడు.” అని చదివి తేజ నాలుక కరుచుకున్నాడు. అయితే కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ దీనిని సరదాగా తీసుకుంటుండగా.. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం రానాపై ఫైర్ అవుతున్నారు.
అంతేకాదు, “రిలీజ్ బాగా లేట్ అయింది కాబట్టి, సినిమా పేరు పుష్ప టూ లేట్ అని మార్చారు”, “మా ప్రెసిడెంట్ మంచు విష్ణుతో ఎందుకు వచ్చిందిలే.. మళ్ళీ 48 హౌర్స్ లో డిలీట్ చేయమంటాడు.” అంటూ పుష్ప-2 పైన, మంచు విష్ణు పైన కూడా సెటైర్లు వేశారు.