పాస్టర్స్ ఫెడరేషన్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ సిటీ:
కాకినాడ సిటీ (విశ్వం వాయిస్ న్యూస్):క్రైస్తవులపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులు అరికట్టి, హక్కులను పరిరక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ,జిల్లా పంచాయతీ అధికారికి శుక్రవారం పాస్టర్లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షులు ప్రభాకర్ రావు మాట్లాడుతూ జగ్గంపేట మండలం, కాట్రావులపల్లి గ్రామంలో పాస్టర్ జిమ్మి కార్టర్ తన సొంత స్థలంలో చర్చిని నిర్మించుకొని ఆరాధనలు చేసుకుంటుండగా, కొంతమంది దురుద్దేశంతో ప్రార్థనలు జరగకుండా అడ్డుకోవడమే కాకుండా దాడులకు ప్రయత్నించడం సరికాదన్నారు. రాష్ట్రంలో క్రైస్తవులపై దాడులు రోజురోజుకు పెరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటివన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా పంచాయతీ అధికారి వారికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఉన్నతాధికారులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించి ఆ పాస్టర్ కు రక్షణ కల్పించి, చర్చికి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సమాజం అంతా ఏకమై ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ నాయకులు రెవరెండ్ జీవన్ కుమార్, కొలమూరి ప్రభాకర్ రావు, అడ్వైజరీ బోర్డు మెంబర్ లు రెవరెండ్ ఆకుమర్తి శామ్యూల్, జేమ్స్, ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మరియు వివిధ జిల్లాల నాయకులు, పలువురు పాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.