– రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
90 రోజుల్లో ఇంటి పట్టా జారీకి సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే దరఖాస్తులను ప్రత్యేకంగా దృష్టిసారించడంతో పాటు భూ సేకరణకు ప్రణాళికాయుత చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మంత్రి దాడిశెట్టి రాజా.. ఎంపీ వంగా గీత, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఇలక్కియ; జగ్గంపేట, ప్రత్తిపాడు శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు, పర్వత శ్రీ పూర్ణ చంద్రప్రసాద్‌లతో కలిసి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై చర్చించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, స్పందన కార్యక్రమం; గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్‌బీకేలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలకు శాశ్వత భవన నిర్మాణాలు; 90 రోజుల్లో ఇంటి పట్టాల జారీకి భూ సేకరణ, మనబడి నాడు-నేడు పనులు తదితరాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక వేదిక స్పందన జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని.. ఈ కార్యక్రమాన్ని మున్ముందు కూడా ఇలాగే కొనసాగేందుకు జిల్లాస్థాయి అధికారులు.. క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ ఆరోగ్య భరోసా లభించేలా పీహెచ్‌సీలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరముందన్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను అవసరం మేరకు జనావాసాలతో మ్యాపింగ్ చేయాలన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన నేపథ్యంలో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) పరిధిలోకి వచ్చే ప్రాంతాల ఖరారుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తొండంగి వంటి ప్రాంతాలను విద్య పరంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు పాఠశాలల్లో అదనపు తరగతిగదుల ఏర్పాటుపై దృష్టిసారించాలని మంత్రి దాడిశెట్టి రాజా అధికారులకు సూచించారు. సాగునీటి అవసరాలను తీర్చే చెరువులు ఆక్రమణలకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాకినాడ, పెద్దాపురం ఆర్‌డీవోలు బీవీ రమణ, జె.సీతారామారావు, కుడా వీసీ కె.సుబ్బారావు, డీఈవో డి.సుభద్ర తదితరులు పాల్గొన్నారు.