– సిఐటియు నాయకులు డిమాండ్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, ( విశ్వం వాయిస్ న్యూస్ )
పరిశ్రమల్లో ప్రమాదాల నివారించి, కార్మికులకు భద్రత సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు స్థానిక జిల్లాపరిషత్ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ 2021 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన పారిశ్రామిక ప్రమాదాల్లో 6500 మంది చనిపోయారని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలిపిందని, వాస్తవ గణాంకాలు ఇందుకు 10 శాతం అధికంగా ఉంటుందన్నారు. బిజెపి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి, యాజమాన్యాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. పరిశ్రమల్లో కార్మికశాఖ అధికారులుగాని, ఫ్యాక్టరీ ఇన్స్ పెక్టర్ గాని నేరుగా తనిఖీలు నిర్వహించడాన్ని రద్దుచేసి, లాటరీ పద్ధతిలో ఎంచుకున్న పరిశ్రమలో మాత్రమే తనిఖీ చేపట్టాలని, ఒకసారి తనిఖీ చేసాక తిరిగి రెండేళ్ల వరకు మరలా తనిఖీ ఆ పరిశ్రమలో చేపట్టకూడదని చట్టం చేసిందన్నారు. యాజమాన్యాలు సొంత పూచీకత్తుపై అన్ని చట్టాలు అమలు చేస్తున్నామని, రాతపూర్వకంగా తెలియజేస్తే సరిపోతుందని చట్టంలో పేర్కొని కార్మికుల భవిష్యత్తు యాజమాన్యాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా మార్చేసిందని విమర్శించారు. దీంతో జిల్లాలో ఏ ఒక్క రైస్ మిల్లులో గాని, ఆక్వా పరిశ్రమలలో గాని పనిచేసే వేలాది మంది కార్మికులకు పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ యాజమాన్యాలు అమలుచేయడం లేదని, మొన్న నూజివీడు ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన 6గురు కార్మికుల విషయంలో గానీ, నిన్న స్థానిక సి పోర్ట్ లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు కార్మికుల విషయంలో గానీ ప్రభుత్వం ఏమాత్రం కల్పించుకోకుండా వాళ్ల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయక పోవడం దురదృష్టకరమన్నారు. తక్షణమే పరిశ్రమలలో రక్షణ సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు కల్పించాలని, ఇందుకు భిన్నంగా వ్యవహరించే యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకుని కార్మికుల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఏ ప్రమాదంలో కార్మికులు చనిపోయినా వారి కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పరిశ్రమల్లో తనిఖీలను తక్షణం పునరుద్ధరించి, ప్రమాదాలను నివారించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి మలకా రమణ, సిఐటియు నగర అధ్యక్ష, ఉపాధ్యక్షులు పలివేల వీరబాబు, మెడిశెట్టి వెంకటరమణ, APMSRU నగర అధ్యక్ష, కార్యదర్సులు అప్పారావు, వెంకన్న, గాయత్రి వర్కర్స్ యూనియన్ నాయకులు టి.వెంకటేశ్వరరావు, కోశాధికారి వీరబాబు, ప్రధాన కార్యదర్శి మధు, శ్రీనివాస్, దాడి బేబి, నాగబత్తుల సూర్యనారాయణ, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.