విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం ( విశ్వం వాయిస్ న్యూస్ )
నవంబర్ మాసంలో సంభవించే ప్రకృతి వైపరీత్యాలు వరదలు, తుఫాన్లు వంటి విపత్తుల కారణంగా రైతులు కోతకు వచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు వీలుగా ఖరీఫ్- 2022 సీజన్ ను ముందుగా జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభిస్తే మూడో పంటకు కూడ వెసులుబాటు కలుగుతుందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ఖరీఫ్ సీజన్ కు సమాయత్తం కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ జలవనరులు, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ నందు 2022- ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లాస్థాయి జలవనరుల శాఖ, వ్యవసాయశాఖ సలహా మండలి, జిల్లా నీటి యాజమాన్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1 నుండి పంట కాలువలు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈలోగా రైతులను సాగు చేపట్టేలా చైతన్య పరచి ప్రభుత్వ ఉద్దేశాన్ని నెరవేర్చాలన్నారు. నోటీపైడ్ వరి వంగడాలు రైతులు సాగుచేసి అధిక దిగుబడులు పొందాలన్నారు. ఇటీవల కాలంలో నవంబరు నెలలో భారీ వర్షాలు, తుఫాను వరదల కారణంగా వరి రైతులకు పంట నష్టం వాటిల్లుతుందన్న విషయాన్ని గమనించడం జరిగిందని దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఒక నెల ముందస్తుగా సాగుకు సమాయత్తం కావాలని సూచనలు ఇచ్చియున్నారన్నారు. జూన్ 1వ తేదీ నుండి ఇరు శాఖల అధికారులు రైతులకు సూచనలు ఇస్తూ సాగుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జూన్ 1 నుంచి సెంట్రల్ డెల్టా పూర్తి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ చర్యలు ఫలితంగా ఖరీఫ్ సీజన్ ఫలవంతం చేయడంతో పాటు మూడవ పంటగా అపరాల సాగు చేసి అధిక దిగుబడులు, ఆదాయం పొందేందుకు అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ముఖ్యంగా రైతాంగానికి మూడవ పంట ద్వారా లబ్ధి పొందేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు దూరదృష్టితో ఆలోచించి గత కొన్నేళ్ల తర్వాత మూడో పంట వేసేందుకు వీలుగా ఖరీఫ్ సీజన్ ను ముందుకు తీసుకువెళ్లడం మంచి పరిణామమన్నారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో ఖరీఫ్ సాగుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు, క్రిమిసంహారక మందులు, ఎరువులు, ఖరీఫ్ సాగు రైతుల అవసరాల మేరకు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి మానసపుత్రిక గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగంగా ఏర్పాటు కాబడిన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని దశలలో పంటల సాగుకు సంబంధించి, సస్యరక్షణ అంశాలలో చేదోడు వాదోడుగా నిలిచి రైతుల సంక్షేమం, అభ్యున్నతికి పాటుపడాలన్నారు. ఈ- క్రాప్ బుకింగ్ ద్వారా రైతు అభ్యున్నతికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాలు మరింత పారదర్శకంగా జవాబుదారీతనంతో అమలు చేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు సూచించారు. తండ్రికి మించిన తనయుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నదాతల అభ్యున్నతి కొరకు అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. రైతు శ్రేయస్సుకు ముఖ్యమంత్రి సూచనలకు తోడు ప్రకృతి సహకరించినట్లయితే అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు మన రాష్ట్రంలో ఏర్పాటు చేశారని ప్రతి దశలో రైతులకు అండగా నిలిచి నారు మడి తయారు, శ్రీ వరి విధానంలో వరి సాగు, నాట్లు వేయడం వంటి సాగు విధానాలు, సస్యరక్షణ, నీటి యాజమాన్య పద్ధతులు, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంలోను ఈ కేంద్రాలు తోడ్పడాలని, ప్రకృతి గోవు ఆధారిత సేంద్రియ వ్యవసాయసాగు విధానాల పట్ల రైతులలో మక్కువ పెంచాలన్నారు. పంటల సాగుకు సంబంధించి అన్ని దశలలో పక్కా కార్యాచరణ ప్రణాళికలు రచించి అమలు పరచాలన్నారు. డివిజన్, మండల, ఆర్ బి కె స్థాయిలలో జలవనరులు, మరియు వ్యవసాయ శాఖ సలహా మండలి సమావేశాలు నిర్వహించి రైతులకు క్షేత్ర స్థాయిలో ఖరీఫ్ 2022 కార్యాచరణ ప్రణాళికలపై పూర్తి అవగాహన పెంపొందించి పంటల సాగుకు సిద్ధపరచాలన్నారు. జలవనరులు వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి సమన్వయం రైతుల భాగస్వామ్యంతో ఖరీఫ్ సీజన్- 2022 ను ఫలవంతం చేయాలని ఆకాంక్షించారు. రైతు భరోసా కేంద్రాల సిబ్బంది పంటల సాగులో రైతులకు మంచి మెరుగైన సూచనలు ఇస్తూ అధిక దిగుబడులు సాధించే దిశగా ప్రోత్సహిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని సూచించారు. కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖకు సంబంధించి 83 పనులు 12 కోట్లతో వివిధ దశల్లో ఉన్నాయని కాలువ పనులు 54, డ్రైనేజీ పనులు 20, హెడ్ వర్క్స్ కు సంబంధించి 9 పనులు వీటిలో ఉన్నాయన్నారు. వ్యవసాయ శాఖకు సంబందించి ఖరీఫ్ సీజన్ కు సన్నద్దతకు గాను 72,476 హెక్టార్లు ఆయకట్టు విస్తీర్ణానికి గానూ 37 వేల క్వింటాలు విత్తనాలు లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. వీటిలో 29 వేల క్వింటాల విత్తనాలు సబ్సిడీపై ఇస్తుందన్నారు. మిగిలినవి వివిధ రకాలుగా సమకురుస్తామన్నారు. ఈ సాగుకు సంబంధించి 45 మెట్రిక్ టన్నులు ఎరువులు సరఫరా చేసేందుకు చర్యలు గైకొంటున్నామన్నారు. వాటర్ మేనేజ్మెంట్ పక్కాగా చేపట్టి కాలువ చిట్ట చివరి భూములకు సాగునీరు అందించాలని జలవనరుల శాఖకు ఆదేశించారు. నీటి సంఘం అధ్యక్షులు త్రినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ ధాన్యాగారంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉండేదని ఇప్పుడు డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆ పేరును కైవసం చేసుకోబోతుందని కోనసీమ జిల్లా సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉండటం వలన డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని ఈ-క్రాఫ్ బుక్కింగ్ కు సంబంధించి ప్రొక్యూర్ సైట్ లో సాంకేతిక కారణాలతో వివరాలు కనిపించడం లేదని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని సరిచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఐ.వి.రావు మాట్లాడుతూ అధికారులు రూపొందించే నివేదికలు మాతృభాషలోనే ఉండాలని వ్యవసాయ ఆయకట్టు రోజురోజుకు తగ్గిన పాత సంఖ్యలో చూపించడం సరి కాదన్నారు. మూడో పంట కనుమరుగైతున్న వేళ మరల మూడో పంటపై దృష్టి సారించి ఆ దిశగా చర్యలు బలోపేతం చేయాలన్నారు. కాలువల్లో నానా వ్యర్దాలు వేసి పంట కాలువలను అపరిశుభ్రంగా మారుస్తున్నారని ప్రజారోగ్యం దృష్ట్యా ఈ పరిస్థితికి మార్పు తేవాలని ఆయన సభా దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ కాలువల్లో , డ్రైన్ల పూడిక తీస్తే గానీ ప్రభుత్వ ఆశయం నెరవేరదని అందుకు సమయం కూడా తక్కువగా ఉందని క్షేత్రస్థాయిలో సాగునీటి నిర్వహణ కొరకు లష్కర్ పోస్ట్ ను నియమించాలని సూచించారు. తొలుత ఇరిగేషన్ ఎస్ ఈ జి.రాంబాబు గోదావరి ఆయకట్టు స్థితిగతులను సభకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ వి.వేణుగోపాలరావు, ఎంపీ చింతా అనురాధ, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎమ్మెల్యే కె.చిట్టిబాబు, జిల్లా ఇరిగేషన్ అధికారి రవిబాబు, వ్యవసాయ శాఖ జెడి వై.ఆనందకుమారి, ఆర్డీవోలు వసంతరాయుడు, సింధు సుబ్రహ్మణ్యం, మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.