విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం ( విశ్వం వాయిస్ న్యూస్ )
అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం సరికాదని, ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని మంత్రి విశ్వరూప్ సూచించారు. నా ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరం అమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. అమలాపురం మంత్రి విశ్వరూప్ ఇంటిపై ఆందోళన కారులు దాడి చేసి నిప్పంటించడం పట్ల మంత్రి స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండు చేసినట్లు తెలిపారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన, బీజేపీ డిమాండు చేశాయని గుర్తు చేశారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని జనసేన నిరసనలు కూడా చేసిందని తెలిపారు. కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. అంబేద్కర్ పేరు పెట్టడంపై గర్వపడాలని సూచించారు.
పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నా… హోంమంత్రి
_________________________________
ఏలూరు: అమలాపురంలో పోలీసులపై జరిగిన దాడిని హోం మంత్రి తానేటి వనిత తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లా గా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేసాయి. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఈ మధ్యనే పేరు మార్చడం జరిగింది. డా.బీఆర్ అంబేద్కర్ మహా మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న,, ఆయన ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. అలాంటి మహానుభావుని పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరం. కోనసీమ జిల్లా ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ కోనసీమ గా పేరు మార్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు. గొడవలు చేసే వారి వెనుక ఉండి నడిపించే వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు 20 మందికి పైగా పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరిచారు. స్కూల్ బస్సు ల ను కూడా తగులబెట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ప్రయత్నిస్తున్నాయి. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై తప్పక చర్యలు ఉంటాయి. ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను అదేశిస్తున్నాను అన్నారు.
సంయమనం పాటించాలి – సజ్జల
______________________
తాడేపల్లి: కోనసీమ జిల్లా ప్రజలు సంయమనం పాటించాలని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. అమలాపురంలో అల్లర్లను ఆయన ఖండించారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయని, అన్ని వర్గాలు కోరాయని, ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయం కాదన్నారు. దీని వెనుక ఏవో రాజకీయ శక్తులు ఉన్నాయని చెప్పారు. అంబేద్కర్ పేరు పెడితే పార్టీకి లాభం ఉంటుందా అని ప్రశ్నించారు. అంబేద్కర్ ఏ వర్గానికి చెందిన వ్యక్తి కాదని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాల కుట్ర అని మండిపడ్డారు. అంబేద్కర్ పేరు పెట్టాలని అన్ని వర్గాలు కోరాయని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాల కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు.