విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజోలు:
రాజోలు, విశ్వం వాయిస్ న్యూస్;
ఆంధ్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో ఉద్యోగ విరమణ చేసిన ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ దేవ వరప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. గురువారం హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరారు. పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి వరప్రసాద్ ని ఆహ్వానించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజోలు నియోజకవర్గం దిండి గ్రామానికి చెందిన వరప్రసాద్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో 30 ఏళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించారు. పౌర సరఫరాల శాఖ కార్యదర్శి, కమిషనర్, కార్మిక శాఖ కమిషనర్ లాంటి కీలక పోస్టుల్లో పనిచేశారు. వరప్రసాద్ మాట్లాడుతూ “ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చక్కబడి అభివృద్ధి చెందాలంటే మంచి నాయకత్వం అవసరం. అది పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యమవుతుంది. ఆ నమ్మకంతోనే జనసేనలో చేరాను. పవన్ కళ్యాణ్ తో కలసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను” అన్నారు.