విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి పన్నుకు సంబంధించి ఎన్నో ఏళ్ళుగా పెండింగ్‌లో ఉన్న వ్యత్యాసాలను త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు నగరపాలక సంస్థ మేయర్ సుంకర శివప్రసన్న సాగర్ చెప్పారు. స్థానిక స్మార్ట్‌సిటీ కార్యాలయంలో ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాలు, కార్పొరేటర్లతో ఈ అంశంపై గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావుతోపాటు పలువురు అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ శివప్రసన్న మాట్లాడుతూ ఇటీవల నాలుగు డివిజన్లలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పన్నులకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపద్యంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సూచన మేరకు సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఒకే ఇల్లు, ఒకే కుళాయికి రెండేసి పన్నులు, అడ్రస్‌లలో తప్పులు సహా అనేక సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. దీనిపై సచివాలయాల వారీగా ఇప్పటికే ఈ తరహా వ్యత్యాసాలను గుర్తించి నివేదిక సిద్ధం చేశామని, త్వరలోనే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి డబుల్ ఎస్‌ఎస్‌మెంట్లను తొలగిస్తామన్నారు. అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు మాట్లాడుతూ ఆస్తిపన్నులకు సంబంధించి 2,555 అసైస్‌మెంట్లకు ఫెనాల్టీలతో సహా 9.27 కోట్లు రికార్డుల నుంచి తొలగించాల్సివుందన్నారు. ఖాళీ స్థలాలకు సంబంధించి ప్రస్తుతం ఒక ప్రాంతానికి గుర్తించిన మేరకు 389 స్థలాలకు 5.76లక్షలు, కుళాయి కనెక్షన్లకు సంబందించి 1376 కనెక్షన్లకు గాను పన్నులను రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా గుర్తించామన్నారు. ఇక 3,550 ట్రేడ్‌లైసెన్సులను కూడా గుర్తించామన్నారు. వీటితోపాటు అదనంగా ఏమైనా జత చేయాల్సిన అసెస్‌మెంట్లు ఉంటే మూడు నాలుగు రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేయాలని, ఇందుకు సచివాలయ కార్యదర్శులు, కార్పొరేటర్లు సమన్వయంతో నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. ఎస్‌ఈ సత్యకుమారి మాట్లాడుతూ కాకినాడ నగరంలోని ఒకే కుళాయికి రెండేసి పన్నులు, కనెక్షన్ లేకుండా టాక్స్ పడుదోందన్న ఫిర్యాదులపై సర్వే చేసి నివేదిక రూపొందించామని చెప్పారు. డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణరావు మాట్లాడుతూ డబుల్ ఎస్‌ఎస్‌మెంట్ల నివేదిక సిద్ధం చేశామని, రికార్డులలో పేరు మార్పునకు మాత్రం కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు. ఎంహెచ్‌వో డాక్టర్ ఫృద్వీచరణ్ మాట్లాడుతూ 8,905 ట్రేడ్‌లైసెన్సులు ఉండగా, వీటిలో 4,797 మాత్రమే వినియోగంలో ఉన్నాయని, కోవిడ్ అనంతరం అనేక వ్యాపార సంస్థలు మూతపడడంతో మిగిలిన లైసెన్సులను తొలగించాల్సివుందన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్లు చోడిపల్లి ప్రసాద్, మీసాల ఉదయ్‌కుమార్, కార్పొరేటర్లు ఇమిడిశెట్టి వెంకటరమణమ్మ, వాసిరెడ్డి రామచంద్రరావు, లంకే హేమలత, తెహరాఖాతూన్, కంపర బాబి, గోడి సత్యవతి, కొప్పనాతి సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ తమతమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న కుళాయి పన్నులు, ఆస్తిపన్ను సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నగరపాలక సంస్థ కార్యదర్శి ఏసుబాబు, ఆర్వో చక్కా రమణ, కార్పొరేటర్లు నల్లబెల్లి సుజాత, నందం, కర్రి శైలజ, వడ్డి మణికుమార్, మాజీ కౌన్సిలర్ రాజాన సూర్యప్రకాష్, ఆర్‌ఐలు, రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.