ఎక్సైజ్ సిఐ వీరబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు జిల్లా కలెక్టర్‌కు గౌడ, శెట్టి బలిజ సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
ఓ బీసి కుటుంబంపై ఎక్సైజ్ సిఐ వీరబాబు దాష్టీకంపై గౌడ, శెట్టి బలిజ సంఘాలు భగ్గుమన్నాయి. ఎక్సైజ్ సిఐ వీరబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు జిల్లా కలెక్టర్‌కు గౌడ, శెట్టి బలిజ సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. అక్కడ నుంచి స్థానిక గోకవరం బస్టాండ్ సెంటర్ వద్దగల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరకుని విగ్రహానికి గౌడ, శెట్టి బలిజ సంఘ నేతలు పూలమాలలువేసి నివాళులర్పించారు. సి.ఐ దౌర్జన్యకాండకు నిరసనగా నినాదాలు ఇచ్చారు. అటువైపుగా వెళుతున్న ఎంపి భరత్ రామ్ కాన్వాయ్‌ని ఆపి బిసి కుటుంబంపై సిఐ జరిపిన దౌర్జన్యకాండను వివరించారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ అండ్ అతిధి గృహానికి రీజనల్ కోఆర్డినేటర్ మిధున్‌రెడ్డి విచ్చేస్తున్న నేపధ్యంలో ఆందోళన కారులను అక్కడికి రావాలని మిధున్ రెడ్డి దృష్టికి సమస్య తీసుకువెళతానని హామీ ఇచ్చి, ఎంపి అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ 26 మధ్యాహ్నాం 12 గంటల సమయానికి శ్రీరామపురంలోని తమ నివాసానికి ఎక్సైజ్ సీఐ వీరబాబు జీపులో వచ్చిన రావడం రావడంతోనే తన భర్త చిటికెన అయన్నపై దుర్భాషలు ఆడుతూ కాలితో చాతిపై తన్ని, చితకబాదారని చిటికెన దుర్గ ఆరోపించారు. తాము కిరాణాకొట్టు నిర్వహించుకుంటామని, నిమ్మకాయలు అమ్ముతూ జీవనం సాగిస్తామన్నారు. తన భర్తను ఎందుకు కొడుతున్నారని అడగ్గా, సిఐపై తన భర్త ఎవరితోనే ఏదో చెప్పారంటూ తనను కూడా బయటకు చెప్పుకోలేని భాషతో దుర్బాషలాడారని ఆరోపించారు. ఎక్సైజ్ సిఐ దౌర్జన్యకాండపై రాజానగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని రాత్రి 11 గంటల వరకు స్టేషన్లో ఉంచుకుని రాజీ చేసుకోవాలని చెప్పి పంపించేశారన్నారు. గత మూడు రోజులుగా తమకు న్యాయం చేయాలని పోలీసులు చుట్టు తిరిగినా తమకు న్యాయం జరగలేదన్నారు. తక్షణం ఎక్సైజ్ సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గౌడ శెట్టిబలిజ సంఘం నాయకులు రెడ్డి మణేశ్వరరావు(మణి), అత్తిలి రాజు, రేలంగి వీరవెంకట సత్యనారాయ, కడియాల వరబాబు తదితరులు మాట్లాడుతూ ఓ బీసి కుటుంబం పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిన సిఐని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఈ సిఐపై అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. గత పదిహేనేళ్ళగా ఈ సర్కిల్లోనే ఉంటే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ వీరబాబును తక్షణం సస్పెండ్ చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీలకు అతీతంగా గౌడ, శెట్టిబలిజ, బీసి వర్గాలు అంతా కలిసి పోరాడతామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు వద్దకు సమస్యను తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాలిక శ్రీను, మట్టా వీరబాబు గౌడ్, రేలంగి శేఖర్, మార్గాని శ్రీనివాస్, పిల్లి శ్రీను, మార్గాని శ్రీను, మార్గాని చంటిబాబు, మట్టా అను, రేలంగి భాస్కర్, బుడ్డిగ అప్పారావు, తీగిరెడ్డి శ్రీను, పెద్దఎత్తున గౌడ, శెట్టిబలిజ సంఘం నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.