విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
మండలంలో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు
– అనూహ్యంగా పెరుగుతున్న రోగుల సంఖ్య
– అపారిశ్యుద్ధ పరిస్థితులే ప్రధాన కారణం
– పి హెచ్ సి లని వేధిస్తున్న సిబ్బంది, మందుల కొరత
– ప్రభుత్వాసుపత్రికి రోగుల తాకిడి
– నివారణా చర్యలు వెంటనే చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి
రాయవరం, విశ్వం వాయిస్ ఉభయగోదావరి జిల్లాల ప్రత్యేక ప్రతినిధి సి.హెచ్.ప్రతాప్: ఇటీవలి వర్షాలకు మండలంలో పలు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా రోగ పీడితులు కనిపిస్తున్నారు. జలుబు, జ్వరం , ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారు దాదాపుగా ప్రతీ ఇంటిలో కనిపిస్తున్నారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా కరోనా కేసులు కూడా పెరుగుతుండడంతో రోగులకు కరోనా భయం కూడా తోడయ్యింది. విష జ్వరాలు, మలేరియా, డయేరియా , డెంగ్యూ , ఫైలేరియా వంటి వ్యాధుల బారిన వేలాది మంది పడి ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దానితో ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది తో పాటు మందుల కొరత కూడా వేధిస్తుండడంతో రోగులు జిల్లా ప్రభుత్వాసుపత్రికి పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా రాయవరం, మాచవరం, సోమేశ్వరం గ్రామాలలో జ్వర పీడితుల తాకిడి ఎక్కువగా వుంది. ప్రతీ ఇంటికి కనీసం ఇద్దరు మంచాన పడుతున్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కావాల్సిన రక్త పరీక్షలకు పరికరాలు పని చేయకపోవడం వలన తప్పనిసరిగా ప్రైవేట్ ల్యాబ్ లకు వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.- వర్షాకాలంలో ముందస్తు నివారణా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ముందుగా ఆదేశించినా తదనుగుణంగా పఠిష్టమైన కార్యాచరణ చేపట్టడంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విపలమయ్యిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
గ్రామాలు, పట్టణలలో నెలకొన్న తీవ్ర అపారిశ్యుధ్యం కారణంగానే వ్యాదుల తీవ్రత పెరుగుతున్నట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాల్వలు, నీటి గుంటల శుభ్రత, రోడ్డు పక్కన చెత్తా చెదారాన్ని తొలగించి బ్లీచింగ్ వెయ్యడం, దోమల నిర్మూలనకు ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టకపోవడం వలనే సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో వైద్య మొబైల్ క్లీనిక్ ల ఏర్పాటు మరింత విరివిగా జరగాలని, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కొరత మరింత మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.