అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
అన్యాయంగా విధుల నుంచి తొలగించిన బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామానికి చెందిన అంగన్వాడి కార్యకర్త నడిపల్లి గంగాభవానిన వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి డిమాండ్ చేశారు. గంగాభవాన్ని విధుల్లోకి తీసుకోవాలని రాయవరం ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ప్రారంభించిన రిలే నిరాహార దీక్ష మూడవరోజుకి చేరుకుంది. దీక్ష శిబిరంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి మాట్లాడుతూ అంగన్వాడిలపై రాజకీయ నాయకుల వేధింపులు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్త గంగాభవానిని ప్రజాప్రతినిధి భర్త దుర్భాషలాడి కొట్టినప్పటికీ ఐసీడీఎస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తోపాటు, రాజకీయ నాయకులకు వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు. రాయవరం ప్రాజెక్ట్ సిడిపిఓ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ పైకి, రాజకీయ నాయకులను ఉసిగొల్పి హింసించడం దుర్మార్గమన్నారు .ఇటువంటి వైఖరికి అధికారులు స్వస్తి చెప్పకపోతే ,అంగన్వాడీలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. గంగాభవానిని వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే, రాష్ట్రస్థాయి ఉద్యమానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ దీక్షలో అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.