విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట:
కొత్తపేట, విశ్వం వాయిస్ : రైతు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామంలో జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ మంగళవారం పొలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తడిసిన ధాన్యం కొనాలని జాయింట్ కలెక్టర్కు విన్నవించారు. మల్లవరపు రామారావు అనే రైతు 18 ఎకరాలు సాగు చేశానని, ఆర్ బి కే ద్వారా 225 సార్ల ధాన్యాన్ని మిల్లుకు పంపించారన్నాడు. అయితే తేమ శాతం తేడా వచ్చి మిల్లర్లు తన ధాన్యాన్ని కొంతమేర వెనక్కి పంపారన్నాడు. తేమ శాతం వల్ల బస్తాకు రెండు మూడు కిలోల ధాన్యాన్ని మిల్లర్లు కటింగ్ వేస్తున్నారని వాపోయాడు. ఆర్బికేలలో 15 నుంచి 18 వరకు తేమ శాతం వస్తే, మిల్లర్ల వద్ద 20 నుంచి 22 శాతం వరకు వస్తుందని వాపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచడం లేదని రామారావు జాయింట్ కలెక్టర్ వద్ద గగ్గోలు పెట్టాడు. అలాగే కోణాల ప్రసాద్ కుమార్ అనే రైతు ఆరు ఎకరాలు సాగు చేశానని, తేమ శాతం బాగా తక్కువ వచ్చేలా ధాన్యాన్ని ఆరబెట్టాలని అధికారులు చెబుతున్నారన్నాడు. ఎక్కువ రోజుల పాటు ధాన్యాన్ని ఆరబెట్టడానికి కూలీల ఖర్చు ఎకరానికి అదనంగా 3,000 రూపాయలు అవుతుందన్నాడు. దీనికి స్పందించిన జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తేమ శాతం ఎందుకు వ్యత్యాసం వస్తుందనేది మిల్లర్లతో మాట్లాడుతున్నామని చెప్పారు. ఈ మేరకు పలు టీంలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. అలాగే ఇప్పటివరకు జిల్లాలో 1,76,812 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 37,284 మంది రైతుల వద్ద కొనుగోలు చేశామని వివరించారు. అలాగే అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ముక్కంటి, తహసిల్దార్ కిషోర్ బాబు, తదితర అధికారులు పాల్గొన్నారు.