విశ్వంవాయిస్ న్యూస్, మోతుగూడెం:
అనగనగా ఒక గ్రామం, నది ఒడ్డున ఉన్న ఆ చిన్న గ్రామానికి చుట్టూ నలభై గ్రామాలు, ఆ గ్రామంలో తొలకరి జల్లు మొదలైన క్షణమే గ్రామస్తులు ముందు రానున్న ముంపును పసిగడతారు. పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు వరద నీటితో యుద్ధానికి సిద్ధమవుతారు. ఆ సమయం ఆసన్నమైంది… ఆ రాత్రి గ్రామం నిద్రిస్తున్న వేళ 70 ఏళ్ల ఓ తాత తొలి కోడి కూయకముందే నిద్ర లేచాడు, తాను పడుకున్న చాప క్రింద నీరు చేరడం గమనించాడు. తన కుటుంబ సభ్యులకు, ఇరుగుపొరుగు వారికి చెబుదామంటే కంగారులో గొంతులోంచి మాట రావడం లేదు, అడుగు ముందుకు పడడం లేదు,తన కళ్ళ ముందు, కాళ్ల దగ్గర ఉన్న మంచినీటి చెంబుని కాలితో తన్నే ప్రయత్నం చేశాడు. వచ్చిన చిన్న శబ్దానికి కుటుంబ సభ్యులు ఉలిక్కిపడి లేచారు. ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. అలా గ్రామస్తులంతా కట్టుబట్టలతో ఊరికి దక్షిణ దిశగా పయనమయ్యారు. అప్పటికే ముందస్తు రక్షణ చర్యలు చేపడుతున్న అధికార యంత్రాంగం పడవల సహాయంతో బాధితులను ఆ గ్రామానికి కాస్త దూరాన ఉన్న భవనాల్లోకి తరలించారు. భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగి ఆ గ్రామాన్ని నీట ముంచింది. గ్రామ శివారులో ఉన్న ఒక ఎత్తైన టేకుచెట్టు (గబ్బిలాల చెట్టు) మాత్రం తన కొమ్మపై వాలిన పక్షుల వింత శబ్దాలతో వరదను తప్పించుకొని “హీరో”లా నిలిచింది. అటుగా వస్తున్న పడవలో 50 ఏళ్ల ఒక పెద్దాయన ఏడుస్తూ కనిపించాడు, ఏం జరిగిందని ఆరా తీయగా…తన భార్య, ఇద్దరు కుమారులను మరొక పడవలో తమ ఇంటి చుట్టు ప్రక్కల వారితో క్షేమంగా తీరానికి చేరుకోమని చెప్పి, తాను మాత్రం తన నాలుగు మేకలు, రెండు ఆవులను తీరానికి చేర్చడానికి ఉన్నానని, తన కళ్ళ ముందే అవి వరదలో కొట్టుకుపోతున్నా తాను ఏమీ చేయలేకపోయానని, పశుపోషణ తమ జీవనాధారం అని కన్నీటి పర్యంతమై పడవలో చతికిలపడ్డాడు, వరదలలో ఇలాంటి కన్నీటి గాథలు ఎన్నో నీట మునిగిపోయాయి. వరదల సమాచారం అందిన వెంటనే ఒక గ్రామంలోని ప్రజలంతా వరద బాధితులకు ‘మేమున్నాం,అధైర్యపడవద్దు’ అనే సందేశాన్ని పంపించి, సొంత లాభం కొంత మానుకుని.. పొరుగు వారికి సహాయ పడదాం అని అనుకున్నదే తడవుగా తమకు కలిగినంత ధనం, బియ్యం, త్రాగునీటితో పాటు తమ ఇంటి అవసరాల నిమిత్తం తెచ్చుకున్న నిత్యావసర సరుకులను కూడా వరదబాధితుల సహాయార్థం దానం చేశారు. ప్రతిరోజు వర్షంలో తాము తడిచిముద్దవుతూ కూడా వరద బాధితుల ఆకలి తీర్చారు. విభజించి పాలించే నాయకులు ఉన్న ఈ సమాజంలో, తామే స్వయంగా వంటావార్పు చేసి, పడవల సహాయంతో తాము తెచ్చిన ఆహార పొట్లాలను, వరదలలో చిక్కుకొని చెట్టు కొమ్మలపై, ఇంటి నడి కప్పు పై కూర్చుని, ఆకలితో అలమటించిన ప్రతి ఒక్కరికి తమ స్వహస్తాలతోో ఆహార పొట్లాలను అందించి,భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని మరోసారి రుజువు చేసిన ఎందరో మనుష్యులు, మహర్షులు… లోకా సమస్త సుఖినోభవంతు…