విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
రైతు ముసాయిదా జాబితా ఈ నెల 13 నుండి 17వ తేదీ వరకు సామాజిక తనిఖీ కొరకు ప్రదర్శించబడుతుందని, గ్రామ సభలు కూడా నిర్వహించబడుతున్నాయని మండల వ్యవసాయాధికారి కొప్పిశెట్టి ప్రభాకర్ తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో ఏవో మాట్లాడుతూ మండలంలో 14,651 ఎకరాల్లో వరి సాగైయిందన్నారు . మార్చి 4వ తేదీ వరకు పంట నమోదు చేయడం జరిగిందన్నారు. మండలంలో 99శాతం(14519) ఎకరాల్లో పంట నమోదు చేసినట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల వద్ద మార్చి 10వ తేదీ న పంట నమోదుకు సంబంధించి ముసాయిదా జాబితాను ప్రదర్శించామన్నారు. సామాజిక తనిఖీల్లో భాగంగా రైతు భరోసా కేంద్రాల్లో పంట నమోదు ముసాయిదా జాబితాను ఈ నెల 13 నుండి 17వ తేదీ వరకు సామాజిక తనిఖీ కొరకు ప్రదర్శించడంతోపాటు, గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. రైతులు ప్రదర్శించబడిన ముసాయిదా జాబితాను పరిశీలించి, అభ్యంతరాలు ఉంటే, రైతు భరోసా కేంద్రంలో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. తుది జాబితా ప్రదర్శన తర్వాత ఎటువంటి మార్పులు చేయబడవని, రైతులందరూ గమనించాలని ఏవో ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.