విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:
నందిగామలో న్యాయవాది ఎరగాని వీరబాబు పైన ఆయన కుటుంబ సభ్యుల పైన దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. నందివాడలో న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సహకార్యదర్శి బీర అరుణ్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర ప్రతినిధులు, న్యాయవాదులు శుక్రవారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టు సమీపంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం తక్షణం న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని, నందిగామలో న్యాయవాది వీరబాబు పైన జరిగిన దాడి దారుణమని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్నాలకోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు ఎక్కువ అయ్యాయని, ఇప్పటికైనా కేంద్రం స్పందించాలన్నారు. సీనియర్ న్యాయవాది దాసరి అమ్ములు మాట్లాడుతూ సమాజ పరిరక్షణకు పాటుపడే న్యాయవాదులకు రక్షణ లేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశి శ్రీనివాసరావు మాట్లాడుతూ న్యాయవాది వీరబాబు పై దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ నాయకులు,న్యాయవాదులు కుంచె రాంబాబు,పి.లక్ష్మీ ,నాగేశ్వరరావు,డాక్టర్ సత్యనారాయణ,సబ్బిళ్ళ సోమిరెడ్డి, కళ్యాణ్ దొర,సజ్జ వెంకటకృష్ణ, సాయిరాం,మురళి,తోట నాగేంద్రబాబు,రాజ్ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.