– రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనాలపై దాడులు అరికట్టాలని డిమాండ్
విశ్వంవాయిస్ న్యూస్, రాజమండ్రి సిటీ
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
కక్ష సాధింపుతో కొంతమంది మహిళలు వేధింపులు తాళలేక ఎండి ( మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ ) ఆపరేటర్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. తాడి తోటకు చెందిన పాముల వెంకట గంగాధర్ ( నాని ) మొబైల్ రేషన్ వాహనం నిర్వహిస్తూ జీవిస్తున్నారు. శనివారం యధా ప్రకారం 38 వార్డులో రేషన్ కార్డు హోల్డర్లకు బియ్యం పంపిణీ చేసేందుకు కృష్ణానగర్ లోని అమృత హాస్పిటల్ వీధులో వాహనం ఉంచి బియ్యం వార్డులో ప్రజలకు పంపిణీ చేస్తుండగా అదే వార్డులో నివసిస్తున్న నాగమణి అనే మహిళ తో పాటు మరికొంత మంది మహిళలు రేషన్ పంపిణీ చేసే వాహనం వద్దకు వచ్చి సకాలంలో రేషన్ సరఫరా చేయడం లేదని దుర్భాషలాడుతూ దాడికి దిగారు. ఈ సంఘటనపై పాముల వెంకట గంగాధర్ సర్వర్ స్లోగా ఉందని బియ్యం సకాలంలోనే ఇస్తానని ఎంత చెప్పినా వినకుండా దుర్భాషలాడుతూ దాడికి దిగడంతో మనస్థాపానికి గురి అయిన పాముల వెంకట గంగాధర్ కు గుండె నొప్పి రావడంతో కింద పడిపోయారు . అస్వస్థతకు గురి అయిన వెంకట గంగాధర్ ను హుటాహుటిన హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదని గంగాధర్ మృతి చెందినట్లు అతని భార్య ఇందిరా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెల సకాలంలోనే కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అయితే కొంతమంది కక్ష గడ్డి తన భర్త పై దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. నా భర్త మృతి చెందడంతో ఇద్దరు బిడ్డలతో తాను రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై విచారణ జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలని గంగాధర్ భార్య ఇందిరా ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
ఎండి యూనియన్ నాయకులు ఆందోళన :
ఎండి ఆపరేటర్ గంగాధర్ మృతి చెందడంతో ఎండి ఆపరేటర్ యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తాడితోట అన్నపూర్ణమ్మ గేటు సమీపంలో యూనియన్ అధ్యక్షులు ఆరే చిన్ని, గారా త్రినాధ్, తదితరులు మాట్లాడుతూ ఎండి ఆపరేటర్లు ప్రభుత్వం అందిస్తున్న బియ్యంను సకాలంలో పంపిణీ చేస్తున్నప్పటికీ తమ వాహనాలపై దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏది వచ్చినప్పటికీ పౌరసరఫరాల శాఖ ప్రజలకు అందించే సరుకులను సకాలంలో పంపిణీ చేస్తామని తెలిపారు. అయితే కొంతమంది కావాలనే వాహనాలపై దాడులు చేసి అద్దాలు పగలగొట్టి వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ స్పందించి రేషన్ పంపిణీ చేసే వాహనాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఎండి వాహనాల ఆపరేటర్లు పై దాడులు జరగకుండా అరికట్టాలని డిమాండ్ చేశారు. ఎండి ఆపరేటర్లను వేధింపులకు గురి చేయడం వల్ల పాముల వెంకట గంగాధర్ మృతి చెందాడని తెలిపారు. పాముల వెంకట గంగాధర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఆందోళనలో ఎం.డి ఆపరేటర్లు సంఘం నాయకులు నక్కా శ్రీను,హుస్సేన్ సింగ్, గారా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.