తీవ్రమైన వర్షాల ధాటికి ముంపునకు గురైన వరి పొలాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలను మారుటేరు,ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంకు చెందిన వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.గిరిజారాణి, సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ టి.శ్రీనివాస్ లు రైతులకు పలు సూచనలు చేశారని, రాయవరం మండల వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేష్ కుమార్ ప్రకటన ద్వారా సోమవారం తెలిపారు.
ముఖ్యంగా ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలకు పల్లపు ప్రాంతాలలో వరి పంట ఊడ్చిన దశ నుండి పిలకలు దశలో ౠక్కువగా నీటి ముంపుకు గురికావడం జరిగిందని, ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన ఎం.టి.యు 1318, స్వర్ణ , సంపద స్వర్ణ, ఎం.టి.యు 1061, ఎం.టి.యు 1064 రకాలు ఐదు రోజుల వరకు ముంపును తట్టుకుంటాయని పంట ఊడ్చిన వెంటనే నీట మునిగి మొక్కలు చనిపోయిన ఎడల మనేదలు వేసుకోవాలని తెలిపారు.
నారుమడి లేదా ఎద పద్దతిలో విత్తిన పొలం నీట మునిగితే
నారుమడిలో విత్తనం చల్లిన వెంటనే మూడు కన్నా ఎక్కువ నీట మునిగితే మొలక శాతం గణనీయంగా తగ్గుతుంది. వీలైనంత త్వరగా మడిలో నుండి నీటిని బయటకు తీసి వేసి, పొలం ఆరగట్టాలి. నారుమడి పూర్తిగా దెబ్బతిన్న ఎడల అందుబాటులో ఉన్న స్వల్పకాలిక రకాలతో మరలా తిరిగి విత్తుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.
పంట విత్తిన 7 నుండి 30 రోజుల మద్యలో నారు 5 రోజుల కన్నా ఎక్కువ మునిగితే నారు దెబ్బతినే అవకాశం ఉంటుంది కనుక నీట మునిగిన నారు మడి లో నుండి వీలైనంత తొందరగా నీటిని బయటకు తీసివేసి, తర్వాత 5 సెంట్ల నారుమడి కి 1.0 కిలో యూరియా తో 1.0 కిలో పొటాష్ ను వేసుకోవాలన్నారు. ఈ వాతావరణంలో ఆశించే తెగుళ్ళ నివారణకు లీటరు నీటికి 1.0 గ్రా. కార్బెన్డిజిమ్ లేదా 2.0 గ్రా కార్బెన్డిజిమ్ తో పాటు మాంకోజెబ్ కలిపి పిచికారీ చేసుకోవాలని వివరించారు.
పిలకల దశలో మునిగితే..
పిలకల దశలో సాధారణ రకాలు 5 రోజుల వరకు ముంపును తట్టుకుంటాయి. కాగా ముంపును తట్టుకునే ఎం.టి.యు 1064, పి.ఎల్.ఎ 1100 వంటి రకాలు వారం రోజుల వరకు నీటి మునకను తట్టుకుంటాయి, అలాగే ఆకులు పైకి కనిపిస్తూ 30 నుండి 40 సెంటీ మీటర్ల నీరు నిలబడే పల్లపు ప్రాంతల్లోని మధ్యస్థ ముంపుని కూడా తట్టుకుంటాయి. అదే ఎం.టి.యు 1232 రకం అయితే 10 నుండి 12 రోజుల పాటు తాత్కాలిక ముంపును కూడా తట్టుకుంటుందన్నారు
పిలకలు కట్టే దశలో నీట మునిగిన వరి పొలం త్వరగా పుంజుకోవడానికి, వీలైనంత్త త్వరగా నీటిని తీసివేసి ఎకరానికి 20 కిలోల యూరియా 10–15 కిలోల పొటాష్ అదనంగా వేసుకోవాలని వరి రైతులకు సూచించారు.

