భవన నిర్మాణ కార్మికులకు బకాయిలు వెంటనే చెల్లించాలి
సిఐటియు లో విలీనమైన భక్తాంజనేయ భవన నిర్మాణ కార్మిక సంఘం
సెప్టెంబర్ 15న ఛలో విజయవాడ కు పిలుపు
భవన నిర్మాణ కార్మికులంతా తప్పనిసరిగా ప్రభుత్వ లేబర్ కార్యాలయంలో తమ పేరును నమోదు చేయించుకుని, గుర్తింపు సభ్యత్వం పొంది, సంక్షేమానికి అర్హులుగా ఉండాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సిఐటియు అధ్యక్షులు జి.దుర్గాప్రసాద్ తెలిపారు. మండల కేంద్రమైన రాయవరంలో గల కాపుల రామాలయం వద్ద శ్రీ భక్తాంజనేయ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు కె.తాతారావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో రాయవరం మండలం సిఐటియు కన్వీనర్ డి. ఆదిలక్ష్మితో కలిసి సిఐటియు జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ ప్రతినిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చిన వెంటనే, భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని చెప్పి, ఏడాది గడచి పోయిందని అయినప్పటికీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించకపోగా, భవన నిర్మాణ కార్మికుల సంరక్షణకు ఎటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టలేదని అన్నారు, భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లైమ్ లు అనగా, భవన నిర్మాణ కార్మికులకు వివాహ సమయంలో లక్ష రూపాయలు సహాయంగా ఇచ్చే వారని, వారి భార్యలకు మొదటి, రెండవ కానుపు సమయంలో ఆసుపత్రికి ఖర్చులకు గాను రూ.20,000 సహకారం అందించే వారని, వారి పిల్లలు చదువుల నిమిత్తం స్కాలర్షిప్ ఇచ్చే వారిని, నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు భీమా వర్తించే దని, అంగవైకల్యం ఏర్పడితే రెండున్నర లక్షలు పరిహారం ఇచ్చే వారని గుర్తుచేశారు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి ఈ డబ్బులు ఖర్చు చేసే వారని వివరించారు. గత జగన్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే బిల్డింగ్ కార్మికుల వెల్ఫేర్ బోర్డును యధావిధిగా కొనసాగిస్తామని హామీనిచ్చి ఈరోజుకి నిలుపుకోలేదన్నారు. కార్మిక శాఖ మంత్రి సుభాష్ సొంత జిల్లాకు చెందినవారే అయినప్పటికీ ఎన్ని సార్లు కలిసి వినత పత్రం ఇచ్చినా ఫలితం లేదని వాపోయారు. గతంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను దుర్వినియోగం చేశారని, మంత్రులకు వాహనాలు,వాహన మిత్ర పథకాలు, వంటి వాటికి ఉపయోగించారని, కార్మికులకు సంక్షేమ నిమిత్తం సాంక్షన్ జరిగింది అందని మొత్తం మూడు కోట్ల రూపాయలు ఉందని ప్రభుత్వాలు స్పందించి ముందుకు కదిలే వరకు సిఐటియు పోరాటం చేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను గుర్తించి, వారి సమస్యలను అర్థం చేసుకొని, పెండింగ్ క్లైమ్ లు అన్నింటిని సకాలంలో ఇప్పించాలని, వారికోసం సమగ్ర చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి, అధికారులకు అనేక రకాలుగా తెలియ జేస్తున్నామని అన్నారు. కొబ్బరి ఒలుపు కార్మికులు, ఆటో కార్మికులు. భవన నిర్మాణ కార్మికుల వంటి సంక్షేమం తమకు అందాలని ఆశపడుతున్నారని, కనుక ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులు లేబర్ ఆఫీసులో నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా సిఐటియు తో కలిసి అనుబంధ సంఘంగా నడవాలని కార్మికులకు సూచించగా 120 మంది కార్మికులు కలిసి సిఐటియు సభ్యత్వం తీసుకొనుటకు జనరల్ బాడీ సమావేశం లో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ, అంగీకారం తెలిపారు. సెప్టెంబర్ 15 రాష్ట్ర లేబర్ కమిషనర్ విజయవాడ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు యధావిధిగా కొనసాగించాలని ధర్నా లో భవన నిర్మాణ కార్మికులందరూ తప్పనిసరిగా పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . మన పోరాట ఫలితంగా తిరిగి వెల్ఫేర్ బోర్డును సాధించుకోవాలని వివరించారు. అనంతరం రాయవరం మండలం సిఐటియు కన్వీనర్ డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ అన్యాయం అధికమైతే సిఐటియు పోరాటం అనివార్యం అని, భవన నిర్మాణ కార్మికులుగా మీకు ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించేంత వరకూ సిఐటియు మీకు తోడుగా ఉంటుందని, ఒక కాకికి కష్టం వస్తే, పది కాకులు తోడు నిలబడతాయని, మన ఐకమత్యం అలా ఉండాలని కార్మికులతో అన్నారు. ఈ కార్యక్రమంలో టి.వెంకట రామరెడ్డి, బి. దుర్గాప్రసాద్, గండి చంద్రశేఖర్, లంక వెంకటరాజు, లంక చందు , రంధి దివాకర్, బండె శ్రీనివాసరావు , భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.