డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట నియోజకవర్గం ,రాయవరం మండలం, చెల్లూరు చెల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యాపుల కేశవ్ పర్యటించిన సందర్భంగా, నియోజకవర్గంలోని పలు చేనేత సంఘాలు మంత్రిని కలిసి, తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,దివంగత నేత,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పరిపాలనలో, పని లేక ఇబ్బంది పడుతున్న చేనేత కార్మికులను ఆదుకుని భోజనం పెట్టారని, ఆయన ప్రవేశపెట్టిన జనతా వస్త్రాల పధకం ద్వారా చేనేత కార్మికులందరూ జనతా వస్త్రాలు తయారుచేసి ఉపాధి పొందారని, కానీ ఇప్పుడు మరల గడ్డుకాలం ఏర్పడి మరమగ్గాల పై తయారుచేసిన వస్త్రాలు, ప్రజలకు తక్కువ ధరలకే దొరకడంతో తమకు ఉపాధి కరువైందని, చేనేత వస్త్రాలకు రాయితీలు ఇవ్వడం ద్వారా తమకు ఉపాధి కల్పించాలని కోరారు. ప్రభుత్వం నుండి చేనేత కార్మికులకు రావాల్సిన పావలా వడ్డీ, నూలుపై సబ్సిడీ, డిస్కౌంట్, మార్కెటింగ్ ఇన్సెంటివ్ వంటి బకాయిలను, త్వరితగతిన చెల్లించి, చేనేత సంఘాల సభ్యులకు పని కల్పించడంలో సహకరించాలని ఆర్థిక మంత్రి పయ్యాపుల కేశవ్ కు అభ్యర్థన పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మండపేట సొసైటీ మాజీ అధ్యక్షుడు కాశిన కాశీ విశ్వనాధం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతా వీరభద్రేశ్వరావు, వెదుళ్ల గణపతి, రాయవరం మండల బిసి నాయకులు దొంతంశెట్టి బాలకేదారీశ్వరుడు(బాల) , తదితరులు పాల్గొన్నారు.