అవును.. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకో సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఎందుకో ఈ మధ్య అస్సలు నోరు విప్పడం లేదు. ప్రభుత్వం తప్పు చేస్తోందని నోరు మెదపట్లేదా..? లేకుంటే మన తప్పులు ఎత్తి చూపడం ఎందుకని మిన్నకుండిపోతున్నారా..? ఇవన్నీ కాదు మన పార్టీ వాళ్లు తప్పు చేయట్లేదు కదా.. ఇక ఎవరేం చేస్తే మనకేంటి..? అని పట్టించుకోకుండానే ఉన్నారా..? అన్నది తెలియట్లేదు. ఇంతకీ కూటమి సర్కారులో సేనాని సైలెంట్ మోడ్ ఎందుకు..? ఏమైంది..? అనేది ఇప్పుడు అటు మీడియాలో.. ఇటు నెట్టింట్లో జరుగుతున్న చర్చ.
సేనాని ఎక్కడ?
వైసీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో ఏ దిక్కున ఏం జరిగినా సరే నిమిషాల్లో స్పందించి.. ప్రభుత్వాన్ని నిలదీసే వారిలో పవన్ ముందుండే వారు. సర్కారు మెడలు వంచి మరీ అన్యాయం జరిగిన చోట న్యాయం జరిగే వరకూ ఒప్పుకునే వారు కాదు. ఇక ప్రజా సమస్యలపై అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉద్ధానం సమస్యను బయటికి తెచ్చి పరిష్కార మార్గం చూపింది పవనే. అలాంటిది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు, అత్యాచారాలు.. ఇసుక, మద్యం, పదవుల విషయంలో గొడవలు, టీడీపీ వర్సెస్ జనసేన రచ్చ ఇలా ఒకటా రెండా ఏపీలో ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ ఏమీ దాస్తే దాగవు.. ఒకవేళ మీడియాను మేనేజ్ చేసినా సోషల్ మీడియాను చేయలేని పరిస్థితి. ఇంత జరుగుతున్నా పవన్ ఎందుకో ఎక్కడా కనిపించట్లేదు.. వాయిస్ వినిపించట్లేదు.
ఇంకెప్పుడు..?
ఏమీ లేనప్పుడు ఎగిరెగిరి పడిన పవన్.. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై కనీస స్పందన లేదు. కడప, హిందూపురం, తెనాలి ఇలా ఒకటా రెండా రెండ్రోజులకో హత్యాచార ఘటన.. మూడ్రోజులకో హత్య ఇలా జరుగుతున్నా పట్టించుకోవట్లేదు. ఎన్నికల ముందు ఆడపిల్లల మాన, ప్రాణాలకు రక్షణగా ఉంటాం.. కఠినంగా వ్యవహరించి తాట తీస్తాం.. తోలు తీస్తామన్న సేనాని శాంతిభద్రతలు అదుపు తప్పినా ఎందుకో సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఇక ఉచిత ఇసుక, మద్యం టెండర్ల విషయంలో ఎంత రాద్ధాంతం జరుగుతోందో సభ్య సమాజానికి తెలిసిందే. కానీ డిప్యూటీ నోట మాట రావట్లేదు. ప్రభుత్వంలో ఉన్నాం కదా.. అనవసరంగా జోక్యం ఎందుకనీ సైలెంట్ అయ్యారా.. లేదంటే దోచుకున్నోళ్లకు దోచుకున్నంత అని ఫ్రీ హ్యాండిచ్చేశారా..? అన్నది సేనానికే తెలియాలి.