అదిగో బిగ్ రివీల్.. ఇదిగో బ్లాస్టయ్యే బ్రేకింగ్ న్యూస్ అంటూ హడావుడి చేసి ఆఖరికి వైసీపీ తుస్సుమనిపించింది. అదేదో ప్రత్యర్థుల బాగోతం బయటపెడతారని లేదా సొంత పార్టీకి చెందిన సంచలన విషయమేదో ప్రకటిస్తారని కార్యకర్తలు, నేతలు అంతకుమించి ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అందరి ఆశలు అడియాసలయ్యాయి. తీరా చూస్తే ఓ ఛానెల్ అధినేత, డ్రగ్స్ వ్యవహారాలు అంటూ ఏదో లీకు చేసింది. ఏదో అనుకుంటే ఇట్టా చేశావేంటి..? అని వైసీపీని సొంత పార్టీ కార్యకర్తలే నెట్టింట్లో తిట్టిపోస్తున్నారు.
దీనికే ఇంత బిల్డప్పా?
వాస్తవానికి గత వారం రోజులుగా రెండు మీడియా సంస్థల అధిపతుల గురించి నానా రచ్చే జరుగుతోంది. ఇందులో ఒకరు లేటు వయసులో లేత ప్రేమ, ఇంకొకరు డ్రగ్స్ వ్యవహారంలో వేలు పెట్టారనే ఆ సంచలన కథనాల సారాంశం. సోషల్ మీడియా వేదిగా ఫొటోలు, కొన్ని వీడియోలు సైతం పోస్టు చేస్తూ ప్రత్యర్థులు, నెటిజన్లు పెద్ద ఎత్తునే హడావుడి చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో అటు టీడీపీ.. ఇటు వైసీపీ బ్లాస్టింగ్, బ్రేకింగ్, బిగ్ రివీల్ అంటూ దినపత్రికలు, టీవీ ఛానెల్స్ మించి రచ్చ చేశాయి. మొదట టీడీపీ ప్రకటించడంతో అబ్బే మనమేం తక్కువ తిన్నామా అంటూ వైసీపీ ప్రకటించింది. తీరా చూస్తే.. మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాను నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?. గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో! అంటూ ఫోన్ నంబర్లు, సస్పెక్ట్ నంబర్లు, ఎవరెవరితో లింక్స్ ఉన్నాయనేది బయటపెట్టింది.
అవసరమా..?
ఇది నిజమా.. అబద్ధమా అనేది అటుంచితే రివీల్ చేసింది వైసీపీ వ్యతిరేక మీడియా కాబట్టి.. దీన్ని కక్ష్యపూరితంగానే చేసిందని చెప్పుకుంటారు. దీనికి తోడు వేరే ఏ దినపత్రిక కానీ, టీవీ చానెల్స్.. కనీసం యూట్యూబ్ చానెల్స్ కూడా ప్రసారం చేయడానికి.. రెండు ముక్కలు పబ్లిష్ చేయడానికి సాహసించరు. ఇక ఎంతసేపూ వైసీపీ కార్యకర్తలు, పార్టీ నేతలు ఫేస్‌బుక్, ట్విట్టర్ వేదికగా హడావుడి చేసుకోవాల్సిందే తప్ప.. పైసా ప్రయోజనమైతే ఏమీ లేదన్నది సొంత పార్టీ నుంచి వస్తున్న మాటలు. ఇక టీడీపీ అంటారా.. అనుకున్న టైమ్ కంటే బుధవారం రాత్రి 8 గంటల సమయంలో అన్నా-చెల్లి ఆస్తుల పంపకాల విషయంలో తలదూర్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షర్మిల రాసిన లేఖను విడుదల చేసింది. దీంతో రాత్రి కాస్త బ్లాస్టింగ్ అయ్యింది.. ఎక్కడ చూసినా ఈ లేఖ గురించే చర్చ జరిగింది. కామెడీ ఏమిటంటే జగన్-షర్మిల ఆస్తుల కోసం గొడవ చేసుకుంటూ ఉంటే టీడీపీ హ్యాపీగా ఫీలవ్వడం, షర్మిల కాకుండా తెలుగుదేశం లెటర్ రిలీజ్ చేయడమేంటనేది ఆ పార్టీ నేతలకైనా అర్థమవుతోందో లేదో..! రేపొద్దున్న ఇలాంటి బిగ్ బిగ్ అంటే ఎవరూ నమ్మే పరిస్థితుల్లో ఉండరేమో మరి.