పవన్‌కు ప్రేమతో.. మోదీ రైలు గిఫ్ట్!.. ఇదేంటి అత్తారింటికి దారేది సినిమాలో లాగా రైల్వే స్టేషన్ అరగంట కావాలన్నట్లుగా ఉందని అనుకుంటున్నారు కదూ..! అవును అది రీల్ అయితే.. ఇది రియల్..! నిజంగానే రైల్వే స్టేషన్, రైలు ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏంటబ్బా క్లారిటీ రావట్లేదా.. అదేనండోయ్ 2,245 కోట్ల రూపాయిల అంచనా వ్యయంతో అమరావతి కొత్త రైల్వే లైన్‌కు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 57 కిలోమీటర్ల ఈ ప్రాజెక్ట్‌కు గురువారం నాడు కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్, కోల్‌కత్తా, చెన్నైతో పాటు దేశంలోని ప్రధాన నగరాలతో అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపడుతున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తీపి కబురు చెప్పారు. వాస్తవానికి ఇది ఎన్నో ఏళ్ల ఆంధ్రుడి కల. టీడీపీ, జనసేన.. ఎన్డీఏ కూటమిలో ఉండటంతో ఇప్పుడు సాధ్యమైంది.
ఇదీ అసలు కథ!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతోనే రైల్వే లైన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. ఇదేంటి చెప్పుకోవడానికి, వినడానికి కాస్త ఓవర్‌గా ఉంది కదా. ఇదే విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి అశ్విని చెబితే ఎలా ఉంటుంది. నిజమేనండోయ్.. పవన్ వల్లే ఇది సాధ్యమైందని స్వయంగా ఆయనే చెప్పారు. దీంతో పవన్‌కు ప్రేమతో.. మోదీ రైలు గిఫ్ట్‌గా ఇచ్చారంటూ జనసైనికులు, మెగాభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. చూశారా.. ఇది పవర్ స్టార్ రేంజ్.. పవన్ కల్యాణ్ చొరవతో.. ఇది చాలు అంటూ అభిమానులు గర్వంగా కాలర్ ఎగరేస్తూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. వాస్తవానికి.. మోదీ-పవన్ మధ్య ఇప్పుడు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సేనాని ఏమడిగినా ఇచ్చేయడానికి ప్రధాని సిద్ధంగా ఉన్నారు.
అటు.. ఇటు..!
కూటమిని మరీ ముఖ్యంగా తనను చూసి ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ పరితపిస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు కూడా రాష్ట్రాభివృద్ధి, అమరావతి నిర్మాణం కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు, అప్పులు, పోలవరం నిర్మాణం ఇవన్నీ బాబు చూస్తున్నారు. ఇక తనవంతుగా పవన్ కూడా కేంద్రంతో చర్చలు జరపడం, కేంద్రంలోని కీలక మంత్రులతో ఎప్పటికప్పుడు కలవడం.. ఆ మధ్య ఢిల్లీకి వెళ్లినప్పుడు నేరుగా ప్రధానితోనే రైల్వే జోన్, రాజధానికి రైలు ఇవన్నీ ప్రస్తావించారట పవన్. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని మరీ సేనానికి గిఫ్ట్‌గా ఇచ్చారట మోదీ. చూశారుగా.. ఇదీ పవన్ ఔర్ మోదీ గిఫ్ట్ కా కహానీ..!