WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

సినిమా చెత్తగా ఉన్నా రివ్యూ పాజిటివ్‌గా ఉండాలి.. ఈ అత్యాశ నుంచి వాళ్ళు బయటికి రావాలి!

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

బిర్యానీ రుచిగా ఉందో లేదో చెప్పడానికి.. మనకు బిర్యానీ వండడం తెలిసి ఉండక్కర్లేదు, ఒక బిల్డింగ్‌ బాగుంది అని చెప్పడానికి మనం ఇంజనీర్లు కావక్కర్లేదు. అయితే ఒక సినిమా చూసి నచ్చిందా లేదా అని చెప్పడానికి మనం కూడా సినిమాగానీ, షార్ట్‌ ఫిలింగానీ చేసి ఉండాలా, మనం కూడా క్రియేటర్స్‌ అయి ఉండాలా.. అంటే మానసిక స్థితి సరిగ్గా ఉన్నవారెవరైనా కాదనే అంటారు. ఎందుకంటే తియ్యగా ఉండే అబద్ధాన్ని ఆస్వాదిస్తారు, చేదుగా ఉండే నిజాన్ని స్వీకరించలేరు. సినిమా వాళ్ళ పరిస్థితి అదే. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టుగా.. తాము ఎంతో కష్టపడి చేసిన సినిమా లేదా తీసిన సినిమా వారికి బాగానే ఉంటుంది. థియేటర్లలో దుమ్ము రేపేస్తుంది అనిపిస్తుంది. దానికి తోడు దర్శకనిర్మాతలకు, హీరోలకు భజన చేసే బ్యాచ్‌ ఉండనే ఉంటుంది. సినిమాను ఇరగదీశారు, అరగదీశారు అంటూ అతిగా ప్రశంసిస్తుంటే అదే భ్రమలో ఉండిపోతారు దర్శకనిర్మాతలు, హీరో. 

థియేటర్‌లోకి ఆ సినిమా పడినప్పుడే దాని అసలు రంగు బయటపడుతుంది. సినిమా గురించి ఎవరు ఎన్ని చెప్పినా అంతిమ తీర్పు ప్రేక్షకులదేనన్న విషయం అందరికీ తెలుసు. సినిమా యూనిట్‌ కొన్ని సంవత్సరాలు పడిన కష్టాన్ని, శ్రమనీ, టెన్షన్‌నీ మొదటి షోతోనే డిసైడ్‌ చెయ్యగల గొప్ప జడ్జి ప్రేక్షకుడు. అయితే కొన్ని వెబ్‌సైట్స్‌లో, యూ ట్యూబ్‌ ఛానల్స్‌లో సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తుంటారు రివ్యూ రైటర్స్‌. సినిమా బాగుంటే.. ఎందుకు బాగుంది, ఏయే సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి, నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ ఎలా ఉంది.. డైరెక్టర్‌ టేకింగ్‌ ఎలా ఉంది అనే అంశాల గురించి ప్రస్తావిస్తారు. సినిమా బాగోకపోతే నిర్మొహమాటంగా బాగాలేదని చెప్తారు, రాస్తారు. ఎందుకు బాగాలేదనేది కూడా విశ్లేషిస్తారు. అయితే ఇది చాలా మంది సినిమా సెలబ్రిటీస్‌కి మింగుడుపడని విషయం. సినిమా ఎలా ఉన్నా రివ్యూ మాత్రం పాజిటివ్‌గా రావాలని వారు కోరుకుంటారు. రివ్యూలు బాగా రానపుడు కొన్ని సినిమాలకు సంబంధించిన దర్శకనిర్మాతలు, హీరోలు రివ్యూ రైటర్లపై విరుచుకు పడ్డ సంఘటనలు ఉన్నాయి. 

తాజాగా అలాంటి ఓ వికృతమైన ఘటన ‘పొట్టేల్‌’ సక్సెస్‌ మీట్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తన నోటికి పని చెప్పారు. ఈ సినిమాకి వచ్చిన రివ్యూలపై అసహనం వ్యక్తం చేశారు. రివ్యూ రైటర్లపై చెప్పడానికి వీల్లేని బూతులతో విరుచుకుపడ్డారు. వారిపై తనకున్న అభిప్రాయం చెప్పడం వరకు ఓకే. కానీ, దాని కోసం వాడిన భాష ఇప్పుడు అభ్యంతరకరంగా మారింది. శ్రీకాంత్‌ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో నోరు పారేసుకున్న శ్రీకాంత్‌.. మరోసారి వార్తల్లోకి ఎక్కే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటివరకు ఏ సినిమా వేదికపైనా వాడని భాషను వాడి ఎంతో మంది ఆగ్రహానికి గురవుతున్నారు శ్రీకాంత్‌. తమ పైత్యానంతా సినిమాలో జొప్పించి సహనాన్ని పరీక్షించే సినిమాలు ప్రేక్షకులపైకి వదులుతారు. ఆ తర్వాత రివ్యూ రైటర్స్‌ నుంచి మంచి రివ్యూలు రావాలని ఆశిస్తారు. ఇది అత్యాశే అవుతుంది. సినిమా ఎంత దారుణంగా ఉన్నా అందరికీ ఆమోదయోగ్యమైన భాషలోనే రివ్యూలు రాస్తుంటారు. కానీ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ మాట్లాడిన మాటలు హద్దులు దాటాయి. అలా మాట్లాడడం వల్ల సినిమాకి ఎలాంటి ఉపయోగం ఉండదన్న విషయం అందరికీ తెలుసు. గతంలో కూడా రివ్యూల అంశంపై కొందరు హీరోలు, నిర్మాతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రివ్యూలు సినిమాల ఫలితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించవని ముందుగా దర్శకనిర్మాతలు, హీరోలు గుర్తించాలి. కొన్ని సినిమాలకు బ్యాడ్‌ రివ్యూలు వచ్చినా సినిమా సూపర్‌హిట్‌ అయి కోట్లు కలెక్ట్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే సినిమా అద్భుతంగా ఉందని రేటింగ్‌ ఎక్కువ ఇచ్చిన సినిమాలు డిజాస్టర్స్‌ అయిన సందర్భాలు కూడా మనకు తెలుసు. ‘పొట్టేల్‌’ సినిమా విషయానికి వస్తే.. ఇదే సక్సెస్‌మీట్‌లో మొదట దర్శకుడు మాట్లాడుతూ ‘మా సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి. ఈమధ్య కాలంలో ఓ చిన్న సినిమాకు ఇలా యునామిస్‌గా మంచి రివ్యూలు రాలేదు. మా సినిమాకు అది జరిగింది’ అంటూ రివ్యూ రైటర్లకు ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు. కానీ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ మాత్రం దర్శకుడి మాటలకు పూర్తి విరుద్ధంగా మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 


advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement