ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో బిజిబిజీగా ఉన్నారు. శనివారం నాడు శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన.. ఏపీలో పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వస్టెర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించారు. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. పరిపాలనలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
రండి.. రారండి!
విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని నిశితంగా వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ద్వారా పేదరిక నిర్మూలనకు విజనరీ సీఎం చంద్రబాబు సరికొత్త పి4 విధానం ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రతి వందరోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నాం. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యతతో కూడిన మానవవనరులను అందించడానికి, తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు విద్యారంగంలో కూడా సంస్కరణలకు శ్రీకారం చుట్టాని పారిశ్రామిక వేత్తలకు వివరించినట్లు ప్రకటనలో లోకేశ్ తెలిపారు.
పాల్గొన్నది వీరే..
ప్రముఖ పారిశ్రామివేత్త ప్రవీణ్ అక్కిరాజు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్ విడియా వైస్ ప్రెసిడెంట్ రామ అక్కిరాజు, విప్రో ప్రెసిడెంట్ నాగేంద్ర బండారు, న్యూటానిక్స్ ప్రెసిడెంట్ రాజీవ్ రామస్వామి, దేవ్ రేవ్ సిఇఓ ధీరజ్ పాండే, గ్లీన్ సంస్థ సిఇఓ అరవింద్ జైన్, నెక్సస్ వెంచర్స్ ఎండి జిష్ణు భట్టాచార్య, సిస్కో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవిచంద్ర, సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేని, స్పాన్ ఐఓ సిఇఓ ఆర్చ్ రావు, మిహిరా ఎఐ సిఇఓ రాజా కోడూరి, ఇవాంటి చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ ముక్కామల, హిటాచీ వంటారా సిఓఓ ఆశిష్ భరత్, గూగుల్ క్లౌడ్ జనరల్ మేనేజర్ సుని పొట్టి, వెస్ట్రన్ డిజిటల్ సిఐఓ శేషు తిరుమల, ఈక్వెనిక్స్ గ్లోబల్ ఎండి కెజె జోషి, త్రీడి గ్లాస్ సొల్యూషన్ సిఇఓ బాబు మండవ, పారిశ్రామికవేత్తలు వంశీ బొప్పన, రాజీవ్ ప్రతాప్, సతీష్ మంత్రి ప్రగడ, సతీష్ తాళ్లూరి పాల్గొన్నారు.