విజయ్ తొలి సభ సూపర్ హిట్!
తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ పార్టీ తమిళగ వెట్రి కళగంకు ఎంతవరకూ ఆదరణ వస్తుందనే ప్రశ్నకు ఆదివారం నాటితో సమాధానం దొరికింది. విల్లుపురం జిల్లా విక్రవండిలో నిర్వహించిన తొలి మహానాడు (బహిరంగ సభ) కు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 లక్షల మంది ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కనుచూపు మేరలో జనం, ఇసుక వేస్తే రాలనంతగా పరిస్థితి నెలకొంది. తండోపతండాలుగా వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారంటే ఏ రేంజిలో వచ్చారో అర్థం చేసుకోవచ్చు. సభా వేదికపైకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన దళపతి.. అంతకుమించి స్పీచ్ ఇరగదీశారు కూడా.
సీరియస్..!
విజయ్ ర్యాంప్‌పై నడిచేంత సేపూ ఈలలు, కేకలలో అభిమానులు, ప్రజలు హోరెత్తించారు. పార్టీ కండువాలు ఆయనకు ఇచ్చేందుకు కొందరు, మరికొందరు విసిరేస్తూ ఎగబడ్డారు. ఏ ఒక్కరినీ అసంతృప్తి పరచని విజయ్.. కండువాలన్నీ మెడలో వేసుకుని, అభివాదం చేస్తూ వేదికపైకి వచ్చారు. ప్రసంగం ప్రారంభానికి ముందే సీఎం.. సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. ఇక స్పీచ్ షురూ చేసిన విజయ్.. నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు కానీ పాలిటిక్స్ విషయంలో భయపడే ప్రసక్తే లేదు.. భయపడను. సినీ రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్ అని గట్టిగా అరుస్తూ ప్రసంగం చేశారు. దీంతో పాటు పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర రాజకీయాలపై ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు.
ఎవరికీ బీ టీమ్ కాదు!
రానున్న తమిళనాడు ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పార్టీ పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు. తమ పార్టీ ఎవరికీ ఏ, బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారని, అయినా తాను అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్తానన్నారు. రాజకీయాలు అంటే పాముతో సమానమని తెలుసని, దేవుడు లేడనే పెరియార్ సిద్ధాంతాలకు తాను వ్యతిరేకమన్నారు. మత రాజకీయాలు అస్సలు ప్రోత్సహించని సభావేదికగా గట్టిగానే తన స్వరం వినిపించారు. మొత్తానికి చూస్తే తొలి ప్రసంగంతోనే అధికార డీఎంకే పార్టీకి కాసింత తగిలీ తగలనట్లుగా చురకలు అంటించారు. ఎందుకంటే సనాత ధర్మం లేదు ఏమీ లేదన్న డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు దేవుడు ఉన్నాడు, లేడనే వారికి తాను వ్యతిరేకమని గట్టిగానే ఇచ్చిపడేశారు. విజయ్ వ్యాఖ్యలపై ప్రత్యర్థుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.