బీఆర్ఎస్ యంగ్ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సొంత మనుషులే అడ్డంగా చేసేస్తున్నారు. అదేదో శత్రువులు ఎక్కడో ఉండరని.. అంటారే అదే అక్షరాలా నిజమవుతోందని సొంతపార్టీ నేతలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. బీఆర్ఎస్ పదేళ్ల ప్రభుత్వం జరిగిన లోటు పాట్లను వెలికి తీసే పనిలో కాంగ్రెస్ సర్కార్ నిమగ్నమైంది. ఓ వైపు హైడ్రా, మరోవైపు మూసీ సుందరీకరణ విషయంలో హడావుడి నడుస్తున్న వేళ తెలంగాణలో రోజుకో పొలిటికల్ బాంబ్ పేలుతోంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల జన్వాడ ఫామ్ హౌస్‌పై పోలీసులు దాడి చేశారు. డీజే సౌండ్స్‌తో రచ్చ, ఫారిన్ లిక్కర్, క్యాసినో ఆనవాళ్లు ఉండటంతో ఇదంతా డ్రగ్స్ పార్టీ అనే సంకేతాలు జనాల్లోకి వెళ్లిపోయాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన విజయ్ మద్దూరికి డ్రగ్స్ టెస్టు చేయగా పాజిటివ్ అని రావడం గమనార్హం.
అంతా రచ్చే..!
జన్వాడ ఫామ్ హౌస్.. ఈ పేరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పట్నుంచీ గట్టిగానే వినిపించింది. ఎందుకంటే ఇది బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మించారని, హైడ్రా కూల్చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అధికారులు రంగంలోకి దిగడం కొలతలు గట్రా చేశారు కానీ ఎందకో మిన్నకుండిపోయారు. ఈ ఫామ్ హౌస్ కేటీఆర్‌ది అని మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా చేయడమేంటి అని అప్పట్లో తీవ్ర విమర్శలు, అంతకుమించి ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వివాదం సద్దుమణిగింది అనుకునే లోపే ఇదే ఫామ్ హౌస్‌లో ఇలా రచ్చ జరగడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. వాస్తవానికి బీఆర్ఎస్ నేతలు ఎక్కడ దొరుకుతారా? అని సర్కార్ వేయి కళ్లతో వేచి చూస్తోంది. నేరుగా ఆయన దొరకలేదు కానీ బావమరిది దొరకడంతో ఈ పార్టీలో కేటీఆర్ సతీమణి కూడా ఉన్నారని.. కేటీఆర్ కూడా పాల్గొని వెళ్లిపోయారని, డ్రగ్స్ టెస్ట్ చేయాల్సిందేనని కాంగ్రెస్‌లోని కొందరు నేతలు పట్టుబట్టారు.
నాడు.. నేడు!
కేటీఆర్ ప్రమేయం లేకుండానే అడ్డంగా ఇలా బుక్కవుతున్నారు. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సోదరి కవిత ఇరుక్కోవడంతో అధినేత కేసీఆర్, కేటీఆర్‌ను ఎంతలా విమర్శించారో అందరికీ గుర్తుండే ఉంటుంది. దీనికి తోడు జైలుపాలయ్యాక బెయిల్ రాకపోవడం, పదే పదే కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగలడంతో ఇక బయటికి రావడం కష్టమే అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఆఖరికి ఎలా బెయిల్ వచ్చింది.. ఇప్పుడు కాస్త ప్రశాంతమే. దీనికితోడు కవిత బయటికి రాలేదు గనుక వివాదం కాస్త మరుగున పడినట్టే. అయితే నేడు బావమరిది దొరకడంతో దీని వెనుక కేటీఆర్ ఉన్నారని ప్రచారం జరగడం, ఆయన బయటికి రావాల్సిందేనని కాంగ్రెస్.. ఆయనకేంటి సంబంధమని బీఆర్ఎస్ నేతలు నిరసనలు, మాటలు యుద్ధం, అరెస్టులతో పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో.. ఆఖరికి కేటీఆర్ పరిస్థితి ఏమవుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.