తమిళ్, తెలుగు భాషల్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి లేడీ సూపర్‌స్టార్ అనిపించుకుంటున్న నయనతారను హీరో ధనుష్ రూ.10 కోట్లు డిమాండ్ చేయడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అసలు ధనుష్, నయనతార మధ్య రాజుకున్న వివాదం ఏమిటి, అది కోర్టు వరకు ఎందుకెళ్లింది, నయనతారను ధనుష్ రూ.10 కోట్లు డిమాండ్ చేసేంత నేరం ఆమె ఏం చేసింది అనే విషయాల గురించి తెలుసుకుందాం.
నయన్, విఘ్నేష్‌లు తమ పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌కి ఇచ్చారు. అయితే నయన్, విఘ్నేశ్‌ల మీద డాక్యుమెంటరీని విడుదల చేయడం ఆలస్యం అయింది. అలా ఆలస్యం అవడానికి హీరో ధనుష్ కారణం అని తెలుస్తోంది. నయన్, విఘ్నేష్‌ల లైఫ్‌లో నేనూ రౌడీనే చిత్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ సినిమాను ధనుష్ నిర్మించాడు. ఆ సినిమాలోని కొన్ని లిరిక్స్, క్లిప్స్, సీన్స్‌ను వాడుకుంటామని, దానికి సంబంధించిన ఎన్‌ఓసీ కావాలని ధనుష్‌ను నయన్ కోరిందట. కానీ, దానికి ధనుష్ ఒప్పుకోలేదు. ఎన్నిసార్లు ఈ విషయం గురించి అడిగినా అనుమతి ఇవ్వలేదు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తమ కెమెరాలతో తీసిన బిహైండ్ సీన్స్‌లోని విజువల్స్‌ను మూడు సెకన్లపాటు ఆ డాక్యుమెంటరీలో వాడారు. తన సినిమాకి సంబంధించి మూడు సెకన్ల ఫుటేజ్ వాడినందుకు రూ.10 కోట్లు చెల్లించాలని నయనతారకు లీగల్ నోటీస్ పంపాడు ధనుష్.
దీనిపై చాలా తీవ్రంగా స్పందిస్తూ ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది నయనతార. ‘నువ్వు నిర్మాతవి అయినంత మాత్రాన మా పర్సనల్ లైఫ్ మీద నీకు ఎలాంటి రైట్స్ ఉండవు. నీ సినిమాలోని క్లిప్స్ వాడుకునేందుకు నువ్వు పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టే మా సొంత కెమెరాలో తీసుకున్న బిహైండ్ సీన్స్‌ను వాడాం. దీనిపై నీకు అభ్యంతరం దేనికి. ఈ విషయాన్ని మేం కోర్టులోనే తేల్చుకుంటాం. దీన్నిబట్టి నీ వ్యక్తిత్వం ఏమిటో తెలుస్తోంది. స్టేజ్ మీద నీ పిచ్చి ఫ్యాన్స్‌ని మభ్య పెట్టేలా ఎన్నో నీతి వాక్యాలు చెబుతావు కదా. నువ్వు మాత్రం అవి పాటించవు. అసలు మా మీద నీకెందుకంత ద్వేషం. ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నావు. నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటల వల్ల నా మనసెంతో గాయపడిరది. అది నేను ఇంకా మర్చిపోలేదు.
నీతో ఉన్న వాళ్ళ సక్సెస్‌ను చూసి కుళ్ళుకోకుండా ఉంటావని, నీలో నువ్వు మనశ్శాంతిని వెతుక్కుంటావని ఈ లెటర్ షేర్ చేస్తున్నాను. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత పెద్ద సక్సెస్ అయ్యాను. నేను ఇంత హ్యాపీగా ఉండడం వల్ల నీకొచ్చిన నష్టం ఏమీ లేదు. ఎవరి పని వారిది, ఎవరి అదృష్టం వారిది. ఇప్పుడు నేను చెప్పిన మాటలకు కౌంటర్‌గా ఏదో ఒక ఈవెంట్‌లో మళ్లీ నాపై పంచ్‌లు వేస్తావు. మంచిదే.. ఆ దేవుడున్నాడు, అన్నీ చూస్తాడు. ఒకరి బాధను చూసి సంతోషించడం చాలా ఈజీ. కానీ, ఎదుటివారి సంతోషంలోనే మన సంతోషం ఉందనేది వాస్తవం. ఇదే మా డాక్యుమెంటరీ ఉద్దేశం కూడా. నువ్వు కూడా ఆ డాక్యుమెంటరీ చూడు. నీ మైండ్ సెట్ మారుతుందేమో. ఎదుటివారికి ప్రేమను పంచడమే ముఖ్యం. నువ్వు కూడా ఏదో ఒక రోజు అందరికీ ప్రేమ పంచుతావనుకుంటున్నాను’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు నయనతార.