వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన పోసాని కృష్ణమురళి, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వరుస కేసులతో ఇరుక్కుపోయారు. ఎంతలా అంటే ఫిర్యాదులు, కేసులు, ఆఖరికి సీఐడీ కేసుతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నాటి నుంచి నిన్న మొన్నటి వరకూ నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, నిన్న గాక మొన్న టీటీడీ ఛైర్మన్‌గా ఎన్నికైనా బీఆర్ నాయుడు వరకూ ఓ రేంజ్‌లో తిట్టిపోశారు. అది విమర్శనాత్మకంగా ఉంటే ఓ లెక్క.. అలా కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటంతో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో రేపో మాపో అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో రాజకీయాలకు దూరంగా ఉంటానని, అది కూడా చచ్చేదాకా అంటూ సంచలన ప్రకటన చేశారు. ఇన్నేళ్లు తాను ఎవరికీ తలవంచలేదని, ఆడవాళ్లనే తిట్టిపోస్తున్న ఈ పరిస్థితుల్లో తనను తిట్టకుండా ఉంటారా? అని మాట్లాడారు. ఈ సందర్భంగా నాటి నుంచి నేటి వరకూ జరిగిన పరిణామాలన్నీ గుర్తు తెచ్చుకుని మరీ మీడియాకు వెల్లడించారు.
లవ్ యూ జగన్, మోదీ..
నేను, నన్ను అందరికంటే ఎక్కువగా పొగిడింది చంద్రబాబే. చంద్రబాబును ఎంతో గౌరవించాను. అది ఆయన్నే అడగండి. ఆయన చేసిన మంచి పనులు లిస్ట్ రాసుకున్నాను, పొరపాట్లు చేసినప్పుడు విమర్శలు కూడా చేశాను. నాకు ప్రధాని మోదీ అంటే చాలా ఇష్టం, అవసరమైతే ఆయన్ను పొగుడుతాను. ది గ్రేట్ ప్రధాని నరేంద్రమోదీ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన జీవితంలో అవినీతి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబు, వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఎన్టీఆర్ ఇలా అందరినీ వారి గుణగణాలను సపోర్ట్ చేశాను. తప్పులు చేసిన ప్రతి ఒక్కరినీ విమర్శించాను. వైఎస్ జగన్ అంటే నాకు చచ్చేంత అభిమానం. జగన్ గారు ఐ లవ్ యూ, నేను ఏం అడిగినా ఇచ్చారు. ఆయన నాకు ఎంతో గౌరవం ఇచ్చారు. అయినప్పటికీ ఇకపై జగన్ గురించి కానీ చంద్రబాబు గురించి కూడా మాట్లాడను. ఏ పార్టీని పొగడను. మాట్లాడను, విమర్శించను. నా కుటుంబం, పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నా. నా కొడుకు రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరాడు. నేను తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్ళడానికైనా సిద్ధం. నేను తప్పు చేశాను అనుకుంటే, నేను కుటుంబంతో కలసి రాష్ట్రం విడిచి వెళ్ళిపోతానని పోసాని చెప్పుకొచ్చారు.
వాట్ నెక్స్ట్
రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మీరు తదుపరి కార్యాచారణ ఏంటని మీడియా అడిగిన ప్రశ్నలకు లాజిక్‌గా సమాధానమిచ్చారు. ఇండియాలో గుళ్ళు, దేవాలయాలు, మొత్తం తిరుగుతానని, కుటుంబ సభ్యులతో వెళ్తానని చెప్పారు. ఎందుకంటే తనకు దేవుడంటే ఇష్టమని చెప్పారు. ఇప్పటి వరకూ అంతా ఓకే రాష్ట్ర వ్యాప్తంగా పోసాని నమోదైన ఫిర్యాదులు, కేసుల సంగతేంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే నటి శ్రీరెడ్డి గుడ్ బై చెప్పేయగా, ఇప్పుడు పోసాని రాజకీయాలకు రాం రాం చెప్పేశారు. ఇక మిగిలింది ఆర్జీవీ మాత్రమే. ఆయన నోటి నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి. మొత్తానికి చూస్తే సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మరీ ముఖ్యంగా వైసీపీకి వత్తాసు పలికిన ఒక్కొక్కరూ ఔట్ అవుతున్నారు. నెక్స్ట్ వికెట్ ఎవరిదో చూడాలి మరి.