త్రాగునీరు, డ్రైనేజీ,రహదారి సౌకర్యాలు లేక ప్రజలు పాట్లు
చీకటి పడితే అంధకారమే, విష సర్పాలు,దోమల తో పోరాటం
పాడైన పోతున్న ఆరోగ్యం పరిష్కారం చూపాలని అధికారులకు విన్నపాలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలంలోనే మేజర్ పంచాయతీ అయిన చెల్లూరు గ్రామానికి చెందిన చింతలతోట, క్రొత్త కాలనీ ప్రాంతాలలో ప్రజలంతా కలిసి తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చెల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎన్. ధనలక్షి కి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలను వారు వివరిస్తూ గత ప్రభుత్వ పాలనలో ఇచ్చిన స్థలములలో గృహాలను నిర్మించుకుని నివసిస్తున్నామని, తాము నివసిస్తున్న ప్రాంతంలో నడిచేందుకు రోడ్డు సౌకర్యం లేక వర్షా కాలంలో పాఠశాల కు వెళ్ళి వచ్చే విద్యార్థులు,ఇతర అవసరాల నిమిత్తం గ్రామంలోని కి వచ్చే సమయంలో బురదమయమైన మార్గాలలో ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ముఖ్యంగా డ్రైనేజీల సౌకర్యం లేక దుర్వాసన లోనే బ్రతుకుతున్నామని, కాలువలు లేక అవస్థలు పడుతున్నామని అన్నారు, ముఖ్యంగా ఆ ప్రాంతమంతా వీధి దీపాల సౌకర్యం లేక వేదన పడుతున్నామని, చీకటి పడితే అంధకారంలో మగ్గుతూ, విష సర్పాల భయంతో బ్రతుకీడుస్తున్నామని వాపోయారు. మంచినీటి ట్యాంకు నిర్మించి త్రాగునీటి కొరకు వేదన పడుతున్న మాకు ఊరట కల్పించాలని కోరారు. కనీసం సౌకర్యాలు లేని ప్రాంతం కావడం వలన దోమల తీవ్రత అధికంగా ఉండి, విష జ్వరాలు, డెంగ్యూ , మలేరియా వంటి వ్యాధులకు గురై, తీవ్ర అనారోగ్యానికి లోనవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. అధికారులు స్పందించి తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతలతోట, క్రొత్త కాలనీ ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

