భార్యా భర్తలను చంపాలనే కక్షతోనే తుపాకీ కాల్పులు
భార్యాభర్తలు ఇరువురునీ ఏక మొత్తంగా మట్టుబెట్టాలనే కక్షతోనే శృంగధార గిరిజన గ్రామంలో ఇటీవల నాటు తుపాకీ కాల్పులు ఘటన చోటు చేసుకుంది. కాల్పులకు తెగబడ్డ రాజవొమ్మంగి మండలం వాతంగి గ్రామానికి చెందిన నిందితుడు ముర్ల మణికంఠ కుమార్ ను పోలీసులు బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. అతన్నుంచి నాటు తుపాకీని, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అతన్ని రిమాండ్ విధింపు నిమిత్తం ప్రత్తిపాడు కోర్టులో గురువారం హాజరు పరచ నున్నారు. ఈ మేరకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో పెద్దాపురం డిఎస్పీ డి.శ్రీహరిరాజు హత్యా యత్న ఘటన వివరాలను వెల్లడించారు. ఆయన కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శంఖవరం మండలం పెదమల్లాపురం పంచాయతీ శృంగధార గ్రామానికి చెందిన కాకూరి చంద్రయ్య (చంద్రబాబు), సూర్యవతి దంపతులు. అయితే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన సూర్యవతి,నిందితుడు ముర్ల మణికుమార్ (గబ్బర్ సింగ్)తో కొంత కాలం పాటు అక్రమ సాన్నిహిత్యాన్ని కొనసాగించి, దాదాపు ఒక వారం క్రితం భర్త ఇంటికి తిరిగి వచ్చి కలిసి ఉంటున్నది. ఐతే తనని వదిలి ఆమె భర్త వద్దకు వెళ్ళి తనని ఒంటరిని చేసిందని ఆమె మీద మణికంఠ కుమార్ కక్ష పెంచుకుని ఆమెను, ఆమె భర్తను ఎలాగైనా చంపాలనే ఉద్దేశ్యంతో 3 వ తేదిన రాత్రి శృంగధారలోని భార్యాభర్తల ఇంటికి వెళ్లి అర్ధరాత్రి ఇంటి అరుగు మీద నిద్రిస్తున్న వారిపై ముర్ల మణికంఠ కుమార్ తన వెంట తీసుకుని వచ్చిన నాటు తుపాకితో 12 గంటల సమయంలో కాల్పులు జరిపాడు. ఇరువురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించి ముద్దాయిని మధ్యవర్తుల సమక్షంలో పెదమల్లాపురం గ్రామ శివారులో బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. ఆయన్నుంచి నాటు తుపాకీ ఆయుధాన్ని కూడా స్వాదీనం చేసుకున్నారు. నిందితునిపై క్రైం నవంబర్ 243/2025 యు/ఎస్ 109(1) బిఎన్ఎస్ సెక్సన్ 27 (2) ఇండియన్ ఆర్మ్స్ ఏక్ట్ కింద కేసు నమోదు చేసారు. మీడియా ముందు వివరాలు వెల్లడించిన పోలీసులు నిందితుడిని ప్రవేశ పెట్టలేదు. అతను ఏ ప్రాంతం వాడో, అతని పూర్వపు నేర స్వభావం ఏమిటో కూడా వెల్లడించలేదు.