అరెస్టయిన దుర్గ
జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలోని బూరుగుపూడి గ్రామానికి చెందిన డ్వాక్రా అసిస్టెంట్ (వి.ఓ.ఏ) దుర్గ అనే మహిళ స్త్రీ నిధి లోన్ల పేరుతో డ్వాక్రా సభ్యుల నుండి దాదాపు రూ. 20.25 లక్షలు మోసపూరితంగా కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమెను కిర్లంపూడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.సూక్ష్మంగా పరిశీలిస్తే, 2022 నుంచి డ్వాక్రా మేటర్-1 గా పనిచేస్తున్న దుర్గ, బూరుగుపూడి గ్రామ పరిధిలోని 42 డ్వాక్రా గ్రూపులకు ఇన్‌చార్జిగా పని చేస్తున్నారు. 2023లో స్త్రీ నిధి ద్వారా 12 గ్రూపులకు లోన్‌ను ఇప్పించారు. అయితే, వాటిలో 8 గ్రూపుల సభ్యుల ఖాతాల్లోకి వచ్చిన డబ్బులను మళ్లీ తీసేందుకు, వారి సంతకాలు/వేలిముద్రలు తీసుకొని నమ్మకద్రోహంగా సుమారు రూ. 20.25 లక్షలు దుర్వినియోగం చేశారు.ఈ వ్యవహారంపై, దేవి శక్తి డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ శ్రీమతి కె. వీరలక్ష్మి గారు మే 24, 2025న కిర్లంపూడి పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. కేసును Cr.No. 60/2025 గా నమోదు చేసి, భారత న్యాయ వ్యవస్థ కొత్త సెక్షన్లలోని BNS U/S 316(2), 316(5), 318(4) కింద దర్యాప్తు చేపట్టారు.పెద్దాపురం ఎస్డిపిఒ శ్రీ శ్రీహరి రాజు పర్యవేక్షణలో, జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో కిర్లంపూడి ఎస్ ఐ జి. సతీష్, WHC గురుశ్రీ, పోలీస్ కానిస్టేబుల్ శివప్రసాద్‌లు అనేక మార్గాల్లో గాలించి, దుర్గను అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను ప్రత్తిపాడు గౌరవ కోర్టులో హాజరుపరిచి 14 రోజులు రిమాండ్ విధించగా, ఆమెను రాజమండ్రి మహిళా కారాగారానికి తరలించారు.ఈ ఘటనపై గ్రామస్థులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిధులు నమ్మి ఇచ్చిన మహిళలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడినట్లు వాపోతున్నారు.