డీఎస్పీ రఘువీర్
గణేష్ ఉత్సవాలు సందర్భంగా మండపాలు నిర్వహించే ఆయా నిర్వాహకులు పోలీస్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ విజ్ఞప్తి చేశారు.
మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఎటువంటి రుసుం చెల్లించవలసిన అవసరం లేదన్నారు.కేవలం అనుమతులు తీసుకుంటే సరిపోతుందన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సింగిల్ విండో విధానం ద్వారా సులభంగా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీ సభ్యులు గణేష్ ఉత్సవ్ నెట్ వెబ్ సైట్ లోకి వెళ్లి కొత్త దరఖాస్తు క్లిక్ చేయాలన్నారు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓ టి పి ద్వారా వెరిఫికేషన్ పూర్తయ్యాక దరఖాస్తు విండో ఓపెన్ అవుతుందన్నారు. దరఖాస్తుదారుని పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, చిరునామా, అసోసియేషన్, కమిటీ సభ్యుల వివరాలు, వారి ఫోన్ నెంబర్లు వెబ్ సైట్ లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. చవితి మండపం స్థలం, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, నిమజ్జనం తేదీ, ఉపయోగించే వాహనాలు తదితర వివరాలు అందులో నమోదు చేయించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత ప్రాంగణాన్ని పోలీసులు పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారన్నారు. చవితి ఉత్సవాలను శాంతియుతంగా, ఎటువంటి అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించాలని డీఎస్పీ రఘువీర్ కోరారు.

