అన్ని దానాలలో అన్నదానం అత్యున్నతం అని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ మండపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ అన్నారు. గణపతి నవరాత్రి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని రెండవ వార్డు గొల్లలగుంట వీధిలో గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం భారీ అన్నదాన సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో లీలాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించికుని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆ వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్, వార్డు ప్రముఖులు నాగులాపల్లి ఈశ్వరరావు, చిట్టూరి గణేష్, కేతా వెంకటరమణ, పెంకే వీరబాబులు అన్నదానం ప్రారంభించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గణేష్ యూత్ కమిటీ సభ్యులు రాత్రి నుంచే శ్రమించి పలు రకాల ఆహార పదార్థాలను సిద్ధం చేశారు. స్వామివారికి నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం విచ్చేసిన లీలాకృష్ణను సతీష్ నాయకత్వంలో సభ్యులు ఘనంగా స్వాగతించి శాలువాతో సత్కరించి గణనాధుని చిత్రపటాన్ని బహూకరించారు.ఈ సందర్భంగా లీలాకృష్ణ మాట్లాడుతూ స్వామి పేరిట అన్నదానం నిర్వహిస్తే స్వామి ఆశీస్సులు లభిస్తాయని చెప్పారు. దానాలలో అన్నదానం అత్యున్నతమని, అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు. భక్తిశ్రద్ధలతో అన్నదాన సమారాధన నిర్వహించడం అభినందనీయమని కమిటీ సభ్యులను ప్రశంసించారు. కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.