పాదచారులు,ద్విచక్ర వాహనదారులు,విద్యార్థులకు సైతం తప్పని తిప్పలు
పరిష్కారం చూపించాలని స్థానికుల గగ్గోలు
కొంతకాలం క్రితం రహదారి పరిస్థితి ఈ విధంగా ఉండేది అని చెప్పడానికి, ఆనవాలుగా ఈ భాగాన్ని మరమ్మత్తులు చేయకుండా వదిలి పెడుతున్నారా.? అన్నట్టుగా కనబడుతుంది ఈ రహదారి భాగం. మండల కేంద్రమైన రాయవరంలోని టెలిఫోన్ ఎక్ఛేంజ్ కార్యాలయం ఎదుట ఉన్న రహదారిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి కొంతకాలమే గడుస్తున్నప్పటికీ, నాణ్యతా లోపమో, నాసి రకపు పనితనమో కారణం ఏదైనా కావచ్చు కానీ లోపం మాత్రం స్పష్టంగా కనబడుతుంది, కొన్ని రోజుల క్రితమే పలు ప్రాంతాల్లో రహదారి పాడవగా, సంబంధిత అధికారులు మరమ్మతులు చేయించగా, ఆనతి కాలంలోనే ఈ భాగం పాడవడంతో అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రహదారిలో ముఖ్యంగా ఒక ప్రాంతంలోనే ఎక్కువగా గుంతలుగా ఏర్పడుతున్నప్పటికీ, తాత్కాలిక ఉపశమనంగా మాత్రమే రహదారి మరమ్మతులు చేపడుతున్నారు, కాగా పూర్తిస్థాయి వర్షాలు రాకమునుపే రహదారి తీరు ఇలా ఉంటే, భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటని పాద చారులు,ద్విచక్ర వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రహదారి వెంబడి భారీ వాహనాల రాకపోకలతో ఏర్పడిన గుంతలలో చేరిన వర్షపునీరు బురదగా మారడంతో, దగ్గరలో ఉన్న ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు సైతం బురద మీద పడడంతో అవస్థలు పడుతున్నారు, ఈ సమస్యపై మౌనం వీడి నాణ్యమైన పద్ధతిలో,పూర్తిస్థాయిలో పరిష్కారం చూపాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.