Thursday, July 31, 2025
Thursday, July 31, 2025

గ్రామ సింహాల గూండా గిరి

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

చట్టాల రక్షణ లో శునక మహారాజులు

ప్రజా ప్రతినిధులకు మొర పెట్టినా మొండి చేయి

మండలంలో విస్తారంగా పెరిగిపోయిన గ్రామ సింహాలు

రంగు నీటి డబ్బా లే రక్షణ గా ప్రజల పాట్లు

విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, రాయవరం

మండలంలో గ్రామ సింహాలు సృష్టిస్తున్న అలజడితో పలు గ్రామాల ప్రజలు నిత్యం భయంతోనే బ్రతుకీడుస్తున్నారు, ప్రతి వీధిలోను పదుల సంఖ్యలో వీధి కుక్కలు గుంపులుగా చేరి, ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో.? ఏ ప్రమాద వార్త తమ చెవిన పడుతోందో ? అనే ఆందోళనలోనే ప్రజానికం సతమతమవుతున్నారు. ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు వెళ్లే మార్గాలు, ఇతర రహదారులపై వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ, కార్యాలయాలకు వివిధ అవసరాల కోసం వచ్చే ప్రజలకు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. సాయంత్రమైతే పిల్లలను ట్యూషన్ లకు పంపించడానికి తల్లిదండ్రులు వణికిపోతున్నారు, పలు ప్రాంతాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉండటంతో కనీస అవసరాలకు ఒంటరిగా దుకాణాలకు వెళ్ళడానికి, రోడ్లపై ఒంటరిగా నడవడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు, రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలను వీధికుక్కలు వెంటపడి తరుముతున్నాయని ప్రమాదాలు జరుగుతాయనే ఆందోళన చెందుతుండగా, అర్ధరాత్రి సమయంలో విపరీత శబ్దాలతో భయం కలిగించేలా వీధి కుక్కల అరుపులతో హడలెత్తిపోతున్నామని, అవి కరిస్తే వచ్చే ప్రమాదకరమైన రాబిస్ వ్యాధి అత్యంత ప్రమాదకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

ఒంటరిగా రహదారిపై నడవాలంటే భయం,

పాఠశాల నుంచి వస్తున్న పిల్లలు ఇంటికి క్షేమంగా చేరేవరకూ భయం,

చీకటి పడ్డాక ఇంటికి చేరాలంటే భయం,

రంగు నీళ్ళతో నిండిన బాటిళ్ల నే రక్షణ కవచాలుగా నెట్టుకొస్తున్న వైనం

 

ఇన్ని భయాలకు మూలం గ్రామ సింహాల సైన్యం

 

* మొరపెట్టుకున్నా.. మొండిచేయి

వీధి కుక్కల భయంతో నిత్యం జనజీవనం అస్తవ్యస్తం అవుతుందని, వీధి కుక్కల ముప్పు నుంచి విముక్తి కల్పించాలని, మండల కేంద్రమైన రాయవరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పర్యటించిన మండపేట శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు ను స్థానికులు కోరగా, దీనిపై తమకు హక్కు లేదని మీరంతా వెళ్లి పంచాయతీ పై పడండి అని ఆయన చెప్పిన సమాధానానికి విస్తుపోవడం ప్రజలవంతు అయింది. ప్రజా ప్రతినిధులు సైతం తమకు సంబంధం లేదని చేతులెత్తేసే పరిస్థితి

అసలు ఈ పరిస్థితి కారణం ఏమిటి?

కొందరు వ్యక్తులు క్రూరత్వం తో సాదు,వన్యప్రాణులను వేటాడడం,హింసించడం, వాటి జీవించే హక్కును కాలరాయడం, వలన పలువురు మానవతా వాదులు జంతు సంరక్షణ చట్టం ద్వారా వీధి కుక్కలు, ఇతరత్రా జంతువులకు ప్రభుత్వాలే భద్రత కల్పించేలా పోరాటం చేయగా 1960 నాటి జంతు సంరక్షణ చట్టం సెక్షన్ 38 ద్వారా రక్షణ కల్పిస్తూ,వీధి కుక్కల కోసం నిర్దిష్టమైన రక్షణ తో పాటు రాజ్యాంగం ద్వారా వాటికి రక్షణ కల్పిస్తూ ఐ.పి.సి సెక్షన్ 428, 429 ప్రకారం కమ్యూనిటీ జంతువులు లేదా పెంపుడు జంతువులను స్థానభ్రంశం చేయడం, అపహరించడం, వాటిపై క్రూరత్వ చర్యలకు పాల్పడే వ్యక్తులకు తీవ్రమైన శిక్షను అమలు చేసేలా పొందుపరిచడం. దీనికి శిక్ష గా కనీసం అయిదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉండడంతో, వీధి కుక్కల విషయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం ముందుకు వెళ్లలేక చేతులెత్తేస్తున్నారు.

ప్రజలు మాత్రం దీనంతటికీ ప్రముఖ వ్యక్తి కారణమని పలువురు సదరు వ్యక్తి ని నిందించడం తోనే, సరిపెట్టుకుంటున్నారు.

 

* వీధి కుక్కల సమస్యకు పరిష్కారం ఏమిటి.?

2019వ సంవత్సరంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థాన మైన సుప్రీంకోర్టు. వీధి కుక్కలను పూర్తిగా తొలగించడం తప్పు అని కాని కుక్కల వలన మానవులకు పొంచి ఉన్న ప్రమాదం అలాగే మానవులు వలన జంతువులకు ఏర్పడే ప్రమాదాలను సైతం గుర్తించి, నష్టం వాటిల్లకుండా హక్కులను రక్షించడం లో సమతుల్యత ఉండాలని తీర్పునివ్వగా, ఈ విషయంలో రెండు మార్గాలను అధికారులు అన్వేషించారు, మొదటిది వీధి కుక్కలకు సంతానోత్పత్తి లేకుండా కుటుంబ నియంత్రణ కోసం శస్త్రచికిత్స లేదా శస్త్రచికిత్స లేకుండా సంతానోత్పత్తి నియంత్రణ పద్ధతిని అనుసరించడం,

రెండవది కుక్కలు కరిచినప్పుడు వాటి ద్వారా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు కుక్కలకు యాంటీ రాబీస్ వ్యాక్సినేషన్ క్రమం తప్పకుండా వేయించడం.

 

* వీధి కుక్కల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి

పాఠశాలలకు వెళ్లే చిన్నారులకు కుక్కలు వెంటపడిన సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి.

* కుక్కలు వస్తే భయపడి పారిపోకుండా నిశ్చలంగా ఉండి చేతిలో ఉన్న వస్తువులతో తప్పించుకోవాలి

* వీధి కుక్కలతో సన్నిహితంగా ఉండకుండా దూరంగా ఉండాలని, ఆహారం తింటున్న లేదా నిద్రపోతున్న కుక్కలకు భంగం కలిగించొద్దని, కుక్కల పైకి రాళ్లు ఇతర వస్తువులు విసరవద్దని, గట్టిగా అరవొద్దని, పిల్లల కుక్కలు మరీ ప్రమాదకరం కనుక వాటి దగ్గరికి వెల్లకూడదని, కుక్కల తోకలు, చెవులు పట్టి లాగకూడదని తల్లిదండ్రులు , గురువులు, పిల్లలకు వివరించాలి

వీధి కుక్క దాడి చేసి కరిస్తే వెంటనే గాయాన్ని సబ్బుతో పలుమార్లు శుభ్రం చేసి, వెంటనే సమీప ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించాలని నేర్పించాలి.

 

 

ఆడ కుక్కలకు “స్పేయింగ్” (అండాశయ గర్భాశయ శస్త్రచికిత్స), మగ కుక్కలకు “న్యూటరింగ్” (పుంస్త్వనాశనము) శస్త్రచికిత్సలు సాధారణంగా చేస్తారు. కొన్ని సందర్భాల్లో, శస్త్రచికిత్స లేకుండా సంతానోత్పత్తి నియంత్రణ కోసం ఇంజెక్షన్లు లేదా ఇతర పద్ధతులను కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాగా వీధి కుక్కలకు రాబిస్ వ్యాధి తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో, మాకు మేము గా వ్యాక్సిన్ చేయడం కుదరదు వాటిని పట్టుకుని ఏర్పాట్లు చేయగలిగితే మా పై అధికారులకు విషయం తెలియజేసి వారి ఆదేశాలతో తదుపరి చర్యలుగా స్టెరిలైజేషన్,వాక్సినేషన్ వంటివి చేపడతాము.

 

గ్రామంలో వీధి కుక్కల సమస్య తీవ్రమైనదే. అయినప్పటికీ వాటి భద్రతకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన విధానాలు,చట్టాలను గౌరవించి, వాటి మనుగడకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలి. వీధి కుక్కల వలన ఏర్పడే ప్రమాద తీవ్రత ను తగ్గించేందుకు గానూ, వెటర్నరీ అధికారుల తో మాట్లాడి త్వరితగతిన ఈ సమస్యకు పరిష్కారం దొరికేలా ప్రయత్నం చేస్తాం.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
అలూరి సీతారామరాజు
హెల్త్ వాయిస్
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
తూర్పు గోదావరి
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
క్రీడా వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo