హుండీ ఆదాయం 1 కోటి 52 లక్షల 91 వేల 193 రూపాయలు
కొత్తపేట ఆత్రేయపురం జూలై 24. విశ్వం వాయిస్ న్యూస్.కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకల నుంచి భారీ ఆదాయం లభించింది.28 రోజులకు గాను రూ.1 కోటి 52 లక్షల 91వేల 193ల ఆదాయం వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి నల్లం సూర్య చక్రధరరావు వెల్లడించారు. గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి, శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని, ఆలయం బయట ఉన్న హుండీల తో పాటుగా అన్న ప్రసాదం హుండీలను సైతం తెరిచి లెక్కించారు. ఆలయ సిబ్బంది, శ్రీవారి సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానుకల లెక్కింపును ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు దగ్గరుండి పరిశీలించారు. వాడపల్లి వెంకన్నకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నగదు రూపంలో రూ.1,26,78,200లు, అన్న ప్రసాదం హుండీల నుంచి రూ. 26,12,993లు లభించాయి.అలాగే భక్తులు సమర్పించిన కానుకల్లో 47 గ్రాముల బంగారం,1కేజీ 600 గ్రాముల వెండి లభించాయి. మలేషియా, యూఎస్ఏ, కువైట్, సౌదీ అరేబియా,ఖతార్, నేపాల్ దేశాలకు సంబంధించి 24 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి. ఈ మొత్తం కార్యక్రమానికి పర్యవేక్షణాధికారిగా మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి వారి ఆలయం అసిస్టెంట్ కమిషనర్ డి సురేష్ బాబు వ్యవహరించారు. తనిఖీదారుగా టీవీఎస్ ఆర్ ప్రసాద్ వ్యవహరించారు.