మండలంలో మహా జోరుగా ఇసుక మాఫియా హోరు
అనుమతి లేని అక్రమ నిలువలతో, ప్రభుత్వాదాయానికి గండి
ప్రజా ప్రతినిధుల అండతో మూడు లారీలు, ఆరు గుట్టలుగా సాగుతున్న ఇసుక దందా.
.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పేద,మధ్యతరగతి,సామాన్య ప్రజలకు ఉచిత ఇసుక పధకం ను అమలు చేయడమే కాక, సీనరేజీ వంటి నామమాత్రపు రుసుములను సైతం తగ్గించి, ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను సాకారం చేసి, సామాన్యులకు అండగా ఉండాలని ప్రభుత్వం యోచించి, అక్రమాలు జరగకుండా ప్రత్యేక బుకింగ్ విధానం ద్వారా ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ.! అక్రమార్కులు మాత్రం ఇసుకను భారీగా సమీకరిస్తూ, దొరికిన అవకాశాలను అందిపుచ్చుకుని, కాసులు సంపాదించడం లో ఏ మాత్రం వెనుకాడడం లేదు.
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రాయవరంలో కొంతమంది వ్యక్తులు ప్రజా ప్రతినిధుల అండతో, రాత్రి వేళల్లో మండల వ్యాప్తంగా అందరినీ సమన్వయ పరుచుకుంటూ, పలు చోట్ల తమకు అనుకూలమైన, చాటుగా ఉన్న ప్రాంతాల్లో, భారీగా వందల టన్నుల ఇసుకను కోటల మాదిరి డంపులు గా ఏర్పాటు చేసుకొని, గుట్టు చప్పుడు కాకుండా దాచారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నదుల్లో నీటి ఉదృతి పెరిగి, నదులలో ఇసుక త్రవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు నిలిపి వేసినప్పుడు, దందా ప్రారంభించి, అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తూ,ఒక్కొక్క ట్రాక్టర్ ఇసుకను రూ.3,000, నుంచి రూ.5,000, వరకూ విక్రయిస్తూ, అక్రమ ఆర్జనతో, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రశ్నించిన వారిపై ప్రజా ప్రతినిధులు సైతం ఆరోపణలు చేస్తూ, అక్రమార్కులకు కొమ్ము కాయడం చూస్తుంటే, అక్రమార్జనలో వారికి భాగము ఉందని స్పష్టమవుతోంది. దీనికి తోడు మండలంలో పోలీసులు, రెవిన్యూ, గనుల శాఖ అధికారుల తనిఖీలు లేకపోవడంతో, యదేచ్ఛగా గడచిన వేసవి లో అక్రమ మట్టి తవ్వకాలు జరిపి, మట్టిని ఇటుక బట్టీ లకు, ఇతరులకు అమ్ముకుని సొమ్ము చేసుకుని సేల్స్ టాక్స్ ద్వారా ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి సైతం ఎసరు పెట్టగా, ప్రస్తుతం ఇసుక అక్రమ నిల్వల దందా ద్వారా అధిక ధరలకు ఇసుకను విక్రయించి, ప్రభుత్వానికి అక్రమార్కులు నష్టం కలిగిస్తున్నప్పటికీ, ప్రజల పక్షాన నిలబడవలసిన ప్రజాప్రతినిధులు అవకాశవాదులు గా మారి అక్రమార్కులకు అండగా నిలబడడంతో, మూడు గుట్టలు, ఆరు లారీలు గా ఇసుక మాఫియా దందా సాఫీగా సాగుతూ, లాభాలు తెచ్చిపెడుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.