890 నమూనాల సేకరించి పరీక్షించగా 532 పంట భూముల్లో జింక్ లోపం
రైతులకు తమ భూసార పరీక్ష ఫలితాలు వెల్లడి
రైతు సేవా కేంద్రం ద్వారా వివరాలు సేకరించి, వ్యవసాయ భూమిలో జింక్ ధాతు లోపం ఉన్న రైతులకు ప్రభుత్వం నుండి జింక్ పంపిణీ చేస్తారని మండల వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేశ్ కుమార్ తెలిపారు. రాయవరం మండలం చెల్లూరు గ్రామంలోని రైతులకు ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. రాయవరం మండలంలో 2024 తొలకరి లో 890 వ్యవసాయ క్షేత్రాల మట్టి నమూనాలు సేకరించి, పరీక్షించగా మట్టి నమూనాల ఫలితాలలో 532 నమూనాలు జింక్ ధాతువు 0.6 పి.పి.ఎమ్ కన్నా తక్కువగా ఉన్నాయన్నారు, భూసార పరీక్ష ఆధారంగా జింకు ధాతువు లోపం ఉన్న పొలాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. జింక్ ధాతు లోపం ఉన్న రైతులకు, ప్రభుత్వం నుండి జింక్ పంపిణీ చేస్తారని, వివరాలు రైతు సేవా కేంద్రంలో సేకరిస్తామని తెలిపారు. చెల్లూరు గ్రామంలోని రైతులకు తమ,తమ భూసార పరీక్ష ఫలితాలను క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ కడిమి బాబురావు, వ్యవసాయ విస్తరణాధికారి ఎ.శివ శంకర్, చెల్లూరు గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.

