బాధితులకు ఎక్స్‌గ్రేషియా 25 లక్షలు ఇవ్వాలి…
ఎమ్మెల్సీ తోట డిమాండ్…
మండల కేంద్రమైన రాయవరం గ్రామ శివారులో గణపతి ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కర్మాగారంలో జరిగిన భారీ విస్ఫోటనం ఘటనలో పదిమంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన బాధితుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.తోట త్రిమూర్తులు మాట్లాడుతూ మునుపటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించి, తక్షణమే చెల్లించేలా ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం బాధితుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం ఖండనీయమని అన్నారు.కొమరిపాలెం, రాయవరం గ్రామాల బాధితుల కుటుంబాల్లో పెద్దదిక్కు కోల్పోయిన పిల్లల చదువుల బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని, పిల్లల విద్యార్హతలు బట్టి ఉద్యోగాలు ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అందించేలా ఏర్పాట్లు చేయాలని తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. కనీసం 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఉంటే బాగుండేదని గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలకు 25 లక్షలు డిమాండ్ చేసి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ మాట మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు.ఈ ప్రమాదంపై ప్రభుత్వం మరింత సానుభూతితో వ్యవహరించాలని, బాధితులకు పూర్తి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.