ఆర్.వి.ఎన్. సదస్సు లో వక్తలు
వ్యవసాయం, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు తోడ్పాటుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విజన్ – 2047 డాక్యుమెంట్ కార్పోరేట్ల ప్రయోజనం కోసమే తయారు చేయబడిందని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ డా. బి. గంగారావు తెలిపారు.
శనివారం సాయంత్రం కాకినాడ యుటిఎఫ్ హోం లో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో “విజన్ 2047 – ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి” అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సత్తిరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో గంగారావు ముఖ్యవక్తగా ప్రసంగించారు. 229 పేజీలు గల ఎపి విజన్ డాక్యుమెంట్, కేంద్ర బిజెపి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉందన్నారు. ఈ డాక్యుమెంట్ లో వ్యవసాయం లో కార్పోరేట్ పద్ధతి ప్రవేశ పెట్టాలని, ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహించాలని ఉందన్నారు. దీనివల్ల చిన్న సన్నకారు రైతులు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులకు అవకాశం లేదని, ప్రైవేటు రంగంలో కూడా చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లేదన్నారు. కార్పోరేట్ తరహా అభివృద్ధి అంటే సంపద ఒకేచోట పోగుపడుతుందన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయన్నారు. చంద్రబాబు నాయుడు 1999 లో కూడా విజన్ 2020 డాక్యుమెంట్ విడుదల చేశారని గుర్తు చేశారు. అది ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో మెకన్సీ కంపెనీ తయారు చేసిందన్నారు. తాజా డాక్యుమెంట్ కూడా ప్రభుత్వ అధికారులు తయారు చేయలేదన్నారు. ప్రజా ఉద్యమం ద్వారా పాలకుల విధానాలు మార్చాలని, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సమగ్రంగా జరుగుతుందన్నారు. రిటైర్డ్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ డా. వి. మహిపాల్ మాట్లాడుతూ ఏదైనా విజన్ డాక్యుమెంట్ విడుదల చేసే ముందు క్షేత్ర స్థాయిలో అధ్యయనం జరగాలన్నారు. తదుపరి వివిధ వేదికలపై చర్చలు జరగాలని, ప్రాధాన్యతలు నిర్ణయించుకుని అందుకు తగిన విధంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలన్నారు. పబ్లిక్ హెల్త్ గురించి ప్రస్తుత డాక్యుమెంట్ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అంబేడ్కర్ ఉద్యమ సీనియర్ నేత అయితాబత్తుల రామేశ్వరరావు మాట్లాడుతూ ఆర్.వి.ఎన్. స్టడీ సర్కిల్ కృషి ని అభినందించారు. మరింతమంది భాగస్వాములై చైతన్య వంతం అయ్యే విధంగా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు వివి రమణ ఆహ్వానం పలుకగా ఆర్.వి. ఎన్. స్టడీ కన్వీనర్ ఎన్. గోవిందరాజులు వందన సమర్పణ చేశారు.

