ఆదాయానికి గండి కొడుతున్నా, చర్యలు మరిచిన యంత్రాంగం
బేర,సారాల మత్తులో విధులు గాలికొదిలేసిన వైనం
ప్రజా ప్రతినిధుల అండతో ఇసుకాసురుల ఆగడాలు
ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ ద్వారా కేవలం రవాణా ఖర్చులు వంటి కొద్దిపాటి ధరకే ఇసుకను ప్రజలకు అందించాలని ప్రయత్నిస్తుంటే , కొంతమంది వ్యక్తులు ఇసుక అధికంగా సమృద్ధిగా లభించే సమయంలో వేసవి కాలంలో ఇసుకను డంపులుగా ఏర్పాటు చేసుకొని, గోదావరి నది ఉధృతి పెరిగి ఇసుక లభ్యతకు కష్టమైన సమయంలో అక్రమ ఇసుక దందా వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. వీరు ఒక లారీ కి రూ.12,000 నుండి రూ.16,000 రూపాయలు తీసుకుంటూ ప్రభుత్వానికి అందే ఆ కొద్దిపాటి ఆదాయానికి గండి కొడుతూ అక్రమ ఆర్జన కు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి తెలపగా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, విశ్వం వాయిస్ తెలుగు దినపత్రిక లో ప్రత్యేక కథనం గా “ఇసుకాసురుల ఇష్టారాజ్యం” అనే కధనం ప్రచురించగా
అప్రమత్తమైన కొందరు ప్రజాప్రతినిధులు కొంత భాగం ఇసుకను దళారీలు నిల్వ ఉంచిన ప్రాంతం నుండి తమ సొంత ప్రాంతాలకు ఇసుకను గుట్టు చప్పుడు కాకుండా తరలించినా, అధికారులు దళారి తో చర్చలు జరిపి మౌనం దాల్చడం పలు అనుమానాలకు తావిస్తుంది. పలు ప్రాంతాలలో అక్రమ ఇసుక నిలువ చేసారని పూర్తి వివరాలు అందించినప్పటికీ,
స్థానిక రెవెన్యూ అధికారులు వారితో బేర, సారాల్లో నిమగ్నమై మర్చిపోయారో, లేక మనకెందుకులే అనుకున్నారో.. కారణం ఏదైనా చర్యలేవి లేకుండానే సుమారు రెండు నెలల కాలం గడిచిపోయింది. శుక్రవారం ఇసుక వ్యాపారి ఆ ఇసుకను అమ్మకాలకు తరలించడానికి యంత్రాలు, భారీ వాహనాలు రాగా ఈ విషయాన్ని రామచంద్రపురం ఆర్.డి.వో వారి కార్యాలయానికి సమాచారం తెలపగా వారు చర్యలు తీసుకుని స్థానిక రెవిన్యూ అధికారులు అక్రమంగా ఇసుక నిలువచేసిన ప్రాంతానికి చేరుకునే సమయానికి వ్యాపారి తన పని ముగించుకుని వెళ్లిపోయారు. మిగిలిన ఇసుకను అంచనా వేసి అధికారులకు తెలిపి ఉద్యోగులు చేతులు దులుపుకున్నారు. ఇదే విషయమై రాయవరం మండల ఎమ్మార్వో ఐపీ శెట్టి ని వివరణ కోరగా ఆర్డీవో కార్యాలయం నుండి సమాచారం అందిందని ఇసుక నిల్వ చేయబడిన ప్రాంతానికి వెళ్లి యజమానితో మాట్లాడామని, ఇసుకకు సంబంధించిన బిల్లులను సమర్పించాలని సూచించామని, అవి లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని, అక్రమ నిలవలను గుర్తిస్తామని తెలిపారు. కాగా రెండు నెలల క్రితమే పూర్తి వివరాలు తెలిసినా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నప్పటికీ మౌనం వహించి, మాటకొకటి, చేతకొకటి అనేటట్లు వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

