కుల వృత్తులు కేవలం ఆర్ధిక వనరులు మాత్రమే కాదు,మన సంస్కృతికి మూలం
ప్రోత్సాహం లేక ఇతర ప్రాంతాలకు వలస పోతున్న పరిస్థితులను అధిగమించేలా ప్రభుత్వాలు సహకరించాలి.
ఆవేదన వ్యక్త పరిచిన ఎం.బి.సి సంఘ అద్యక్షులు యాట్ల నాగేశ్వరరావు
కులవృత్తి కి దక్కాల్సిన గౌరవం సమాజంలో కరువవుతోందని, బ్రాండెడ్ వస్తువులు బిజినెస్ విస్తరణతో సంప్రదాయ సేవా కులవృత్తులు,చేతి పనులు కనుమరుగవుతున్నాయని, రామచంద్రపురం నియోజకవర్గ ఎం.బి.సి సంఘం అధ్యక్షులు యాట్ల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.కులవృత్తుల పట్ల చిన్నచూపు తో,సంస్కృతి పై గౌరవం, కళాకారుల నైపుణ్యం మసకబారిపోయి, మరుగున పడిపోతాయన్నారు. ఒక సమాజం శాశ్వతంగా నిలబడాలంటే మూలాదారాలు ముఖ్యమని, విలువలు,కులవృత్తులు భారత దేశ గ్రామీణ నిర్మాణంలో కలిసిపోయిన జీవన తంత్రమన్నారు, ప్రతీ కులానికి ఒక వృత్తి, ప్రతీ కులానికి ఒక గౌరవం అనే తత్వం శతాబ్దాలుగా గ్రామ జీవన శైలికి ఊపిరిలా ఉందని, కాని తాజాగా కార్పొరేట్ విస్తరణ. బ్రాండెడ్ మార్కెటింగ్, గ్లోబల్ ఫ్యాషన్ కల్చర్ ఈ మూడు కలిసి, సంప్రదాయ వృత్తుల మెడపై కత్తి గా మారిపోయాయని, ఇది కేవలం ఆర్దికంగా కాదు సామాజిక నిర్మాణం వారసత్వ కళలు. కుటుంబ జీవనవిధానాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయన్నారు. కుల వృత్తులలో ముఖ్యంగా రజక, నాయిబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, మత్స్యకార, దేవాంగ, మేధర, గంగిరెద్దుల, ఉప్పర, కమ్మర, యాదవ,తెలికుల, దాసర తదితర కులాలకు జీవన విధానం ప్రకారం ఆర్దికంగా వెనకబడి ఉన్నారని, ప్రభుత్వం కుల వృత్తి కార్పొరేషన్ లు ఏర్పాటు చేసినా వాటిలో పూర్తి నిధులు లేకపోవడం బాధాకరమని విచారం వ్యక్తంచేశారు, గ్రామీణ ప్రాంతాల్లో జీవన విధానం సరిగ్గా లేక ఇతర ప్రాంతాలు,రాష్ట్రాలకు వలస వెళ్తూ, దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే, గ్రామీణ ప్రాంతాల్లో సైతం మన కళలు , మన వృత్తులు అంతరించి పోయే పరిస్తితి ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రభుత్వం ఆయా కులవృత్తి దారులకు నాబార్డు, ఎం.ఎస్.ఎం.ఇ, కే.వి.ఐ.సి వంటి సంస్థలు ద్వారా ప్రభుత్వ సహకారంతో బ్యాంకు ఋణాలు మంజూరు చేసి వారి జీవన విధానాన్ని మెరుగుపరాచాలని పత్రికా ముఖంగా కోరుతున్నానని తెలిపారు.