తుఫాన్ బాధితులకు నగదు, నిత్యావసర సరుకులు పంపిణీ…
మొంథా తుఫాన్ కారణంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ఉన్న వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నగదు, నిత్యావసర సరుకులను శనివారం మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ పంపిణీ చేశారు. కపిలేశ్వరపురం మండలంలోని అద్దంకివారిలంక, నారాయణలంక, వీధివారిలంక, కేదార్లంక మొత్తం నాలుగు లంక గ్రామాలకు సంబంధించి పునరావాస కేంద్రంలో ఉన్న 75 మంది కుటుంబాలకు 3 వేలు రూపాయలు చొప్పున పరిహారం ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం అందించారు. ప్రత్యేకించి మత్స్యకారులకు సంబంధించి 167 మంది కుటుంబాలకు 50 కేజీల బియ్యంతో పాటు ఒక లీటరు వంట నూనె, ఒక్కో కేజీ చొప్పున కందిపప్పు, చక్కెర, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ను పంపిణీ చేశారు. లీలాకృష్ణ మాట్లాడుతూ తుఫాన్ సమయంలో ప్రజలకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని కొనియాడారు. మొంథా తుఫాన్ బాధితులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రాణ, పశు, ఆస్ధి నష్టం ఉండొద్దనే కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం పనిచేసిందన్నారు. ఫించను పంపిణీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మండపేట నియోజకవర్గంకు సంబంధించి పునరావాస కేంద్రంలో ఉన్న వారందరికీ ప్రభుత్వం వారు ప్రకటించిన నగదు, నిత్యావసర సరుకులను అందించే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారని తెలిపారు.

