మాట నిలబెట్టుకున్న మంత్రి సుభాష్
గొల్లపాలెం కుయ్యేరు నిర్మాణ పనులు ప్రారంభం
హర్షం వ్యక్తం చేస్తున్న కాజులూరు మండల ప్రజలు
రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కాజులూరు మండల గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కాంట్రాక్టర్ కి పాత బిల్లులు పడని కారణంగా కాజులూరు మండలం గొల్లపాలెం – కుయ్యేరు రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో ఆ రోడ్డున వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు వారం రోజుల క్రితం అయితపూడి గ్రామ పర్యటనలో ఉన్న మంత్రి సుభాష్ దృష్టకి కూటమి నాయకులు సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి సుభాష్ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ లతో మాట్లాడి వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. వైసీపీ హయాంలో నాలుగేళ్లపాటు చేసిన కోట్లాది రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్న కారణంగా పనులు ఆపాల్సి వచ్చిందని కాంట్రాక్టర్ తెలపడంతో మంత్రి స్పందిస్తూ త్వరలోనే అన్ని బిల్లులు విడుదల అయ్యేలా చర్యచేపడతామని గొల్లపాలెం-కుయ్యేరు రోడ్డును తక్షణమే ప్రారంభించాలని కాంట్రాక్టర్ కు తెలిపారు. అనంతరం ఆగష్టు 5వ తేదీ బుధవారం నుండి రోడ్డు నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తామని మంత్రి కాజులూరు మండల ప్రజలకు, నాయకులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బుధవారం రోడ్డు పనులు ప్రారంభించారు. జేసీబీ లతో రోడ్డు మొత్తాన్ని చదును చేస్తూ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. మంత్రి సుభాష్ ప్రత్యేక శ్రద్దతో రోడ్డుపనులు ప్రారంభమవ్వడం పట్ల కాజులూరు మండల గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే మండలం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆసాభావం వ్యక్తం చేస్తున్నారు.