సచివాలయ అధికారుల పర్యవేక్షణలో 35 పునరావాస కేంద్రాలు
రెవెన్యూ, సివిల్ సప్లయ్, పంచాయతీ రాజ్ శాఖల సంయుక్త నిర్వహణ
తీవ్ర తుఫాను దృష్ట్యా పలు జాగ్రత్తలు తప్పనిసరి
రాయవరం మండల తహశీల్దార్ భాస్కర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల వ్యాప్తంగా మంథా తుఫాను ప్రభావం దృష్ట్యా, తీవ్ర తుఫాన్ గా మారిందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా 35 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాయవరం మండల తహసిల్దార్ భాస్కరరావు తెలిపారు. తీవ్ర తుఫాను ప్రభావం వలన బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు సూచనలు హెచ్చరికలను ఆయన చేశారు. పాడుబడిన పెంకుటిల్లు, పూరిపాకల లో నివాసం ఉండేవారు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్ణయించిన పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. తమ ప్రాంతంలో పరిస్థితులను సమీక్షిస్తూ, బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలో ప్రభుత్వానికి సహకరించాలని స్థానిక యువతను ఎమ్మార్వో భాస్కర్ కోరారు. ముఖ్యంగా నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు ముందుగానే ఆసుపత్రిలో చేరాలని, తుఫాను ప్రభావం పెరిగాక ఇబ్బంది ఏర్పడవచ్చని ఆయన సూచించారు. దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు వృద్ధులు నిత్యవసర వైద్య పరికరాలను, మందులను ముందుగానే సమకూర్చుకోవాలని హెచ్చరించారు. రాయవరం మండల వ్యాప్తంగా చెల్లూరు గ్రామంలో 10, వెంటూరు గ్రామంలో 7, పసలపూడి గ్రామంలో 4, మాచవరం గ్రామంలో 4, సోమేశ్వరం గ్రామంలో 3, నదురుబాధ, కూర్మాపురం, లొల్ల,కురకాలపల్లి, రాయవరం, వెదురుపాక, వి.సావరం గ్రామాలలో ఒక్కొక్క పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా విద్యాశాఖాధికారులు అన్ని పాఠశాలలకు బుధవారం వరకూ, సెలవులు ప్రకటించడంతో మండల వ్యాప్తంగా 25 పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రతి పునరావాస కేంద్రం వద్ద ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకూ, మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు మూడు షిఫ్టులుగా సచివాలయ ఉద్యోగులు, విధులు నిర్వహిస్తారని అత్యవసర వైద్య నిమిత్తం ఏఎన్ఎం లు అందుబాటులో ఉంటారని తెలిపారు. పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న వారికి ప్రభుత్వమే ఆహారాన్ని అందిస్తుందని ఈ ఏర్పాట్లను రెవెన్యూ, పౌర సరఫరాలు, పంచాయతీ రాజ్ అధికారులు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నట్లు రాయవరం మండల తహశీల్దార్ భాస్కర్ రావు తెలిపారు.

