స్త్రీ శక్తి సూపర్ సక్సెస్ …
సూపర్ సిక్స్ పై ప్రశంసల జల్లు…
మండపేటలో మహిళలతో భారీ సభ…
మహిళలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు.మండపేట బస్ స్టాండ్ లో ఆదివారం స్త్రీ శక్తి విజయోత్సవ సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సభాధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు.మహిళలు మాట్లాడుతూ చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. ఆనాడు అన్న ఎన్.టి.ఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి ఆర్థిక భరోసా ఇవ్వడంతో పాటు మహిళలకు వివిధ పదవుల్లో అధిక ప్రాధాన్యత, రాజకీయ రిజర్వేషన్లు కల్పించారని కొనియాడారు. ఆయన తరువాత చంద్రబాబు అదే దారిలో డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు గుర్తింపు తీసుకువచ్చారన్నారు. పలు పథకాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు విశేష కృషి చేశారన్నారు. తల్లికివందనం, ఉచిత గ్యాస్, స్త్రీ శక్తి, మహాశక్తి ఇలా ప్రతి పథకంలోనూ మహిళలను ప్రధాన భాగస్వాములు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ముఖ్యంగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మహిళల పట్ల ఎంతో గౌరవమర్యాదలు కనబరుస్తారని పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యే కావడం గర్వకారణమని పేర్కొన్నారు ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ తనను నాలుగుసార్లు ఎమ్మెల్యే గా వరుసగా గెలిపించిన ప్రజలందరికీ పాదాభివందనం తెలియజేశారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో భాగంగా పింఛన్లు అందరికీ మూడు నెలలు వెనక్కి వెళ్ళి మరీ ఇచ్చారన్నారు. మూడు వేలు ఉండే దివ్యాంగుల పింఛను ను 6 వేలు చేయడం జరిగిందన్నారు. పింఛన్లు నిమిత్తం ఏటా 192 కోట్లు ఒక్క మండపేట నియోజకవర్గం నుండే ఖర్చు అవుతున్నట్లు చెప్పారు. 38,435 మంది లబ్ధిదారులకు గానూ 335 మందికి అనర్హులుగా గుర్తిస్తూ నిజాయితీని నిరూపించుకోమని నోటీస్ లు ఇవ్వగా ఖాళీగా ఉన్న వైసీపీ నేతలు దానిపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 2 వేల పింఛను ను 3 వేలు పెంచడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ పెంచుకుంటూ పోతానని చావు తెలివితేటలు ప్రదర్శించాడని విమర్శించారు.అందుకే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి చావు దెబ్బ కొట్టారన్నారు. ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ను రద్దు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ప్రజలు సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే వేగుళ్ళ సూచించారు. ఐదేళ్లు పాటు ప్రజలు నెల నెల కట్టే విద్యుత్ బిల్లును బ్యాంక్ లకు కడితే ఆ తరువాత 20 ఏళ్ల పాటు విద్యుత్ బిల్లు కట్టాల్సిన పని లేదన్నారు. గతం లో మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరిలో కలపాలని కోరినా గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజల కల నెరవేర్చే బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం లో తనదని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఎనిమిదిన్నర లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. అన్న క్యాంటీన్ ద్వారా ఎంతో మంది నిరుపేదలకు అన్నం పెడుతున్నారన్నారు. గతం లో దౌర్భాగ్యం కొద్ది అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని దుర్మార్గంగా రద్దు చేశారన్నారు. మండపేట లో కొంత మంది నాయకులు వారి ప్రభుత్వ హయాంలో చేసిందేమీ లేకపోయినా ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు మాత్రం పేర్లు పెడుతున్నారన్నారు. ఒకప్పుడు చంద్రబాబు హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే ప్రస్తుతం అది తెలంగాణా రాష్ట్రం కు ఆర్థిక శక్తి గా మారిందని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి జరిగితే ఆ ప్రభావం రాష్ట్రం అంతటా ఉంటుందని పేర్కొన్నారు. చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్ లు, పార్టీ నాయకులు, రాష్ట్ర నీటిపారుదల శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ, మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్,తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతి,మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి, బీజేపీ, జన సేన , టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

